ఐదు నెలల్లో మారిన హస్తవాసి

Congress lost the plot in recently won Rajasthan, Chhattisgarh, MP - Sakshi

65 స్థానాల్లో ఐదింటిని కూడా దక్కించుకోని కాంగ్రెస్‌

మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ దైన్యం

న్యూఢిల్లీ: సరిగ్గా ఐదు నెలల క్రితం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో పాతుకుపోయిన బీజేపీని మట్టి కరిపించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ పూర్వవైభవం సాధిస్తుందని ఆ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం భావించారు. అయితే కేవలం 5 నెలల కాలంలోనే ఈ అంచనాలు తారుమారయ్యాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 65 లోక్‌సభ స్థానాలుంటే బీజేపీ ఏకంగా 61 సీట్లను కైవసం చేసుకుని మళ్లీ పుంజుకుంది. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాల్లో 28 చోట్ల, రాజస్తాన్‌లోని 25 స్థానాల్లో 25 చోట్ల, ఛత్తీస్‌గఢ్‌లోని 11 సీట్లలో 9 చోట్ల విజయదుందుభి మోగించింది.  రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో యువనాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ భావించారు. అయితే యూపీఏ చైర్‌పర్సన్‌ రాహుల్‌ ప్రయత్నాలను అడ్డుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల వేళ పోల్‌ మేనేజ్‌మెంట్‌కు సీనియర్ల అనుభవం అవసరమనీ, వారిని కాదని ఇతరులను నియమిస్తే సహాయనిరాకరణ ఎదురుకావొచ్చని సూచించారు. అందులో భాగంగానే రాజస్తాన్‌ సీఎంగా అశోక్‌ గెహ్లోత్, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నియమించారు. ఎన్ని వ్యూహాలు రచించినా మోదీ హవా ముందు కాంగ్రెస్‌ సీనియర్ల ప్రణాళికలు బెడిసికొట్టాయి. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ పోటీచేసిన ఛింద్వారాతో పాటు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్, కొబ్రా స్థానాలను మాత్రమే కాంగ్రెస్‌ గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లోని గుణా నుంచి పోటీచేసిన కాంగ్రెస్‌ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఓటమి చవిచూశారు. రాజస్తాన్‌లో కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 24, ఆర్‌ఎల్‌టీపీ ఒక సీటు గెలుచుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సిట్టింగ్‌ ఎంపీలు కాకుండా కొత్త వారిని రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో 11 స్థానాల్లో 9 సీట్లను ఖాతాలో వేసుకోగలింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top