స్వీట్‌ 16

CM KCR Target to Clean Sweep in Lok Sabha Elections - Sakshi

అసెంబ్లీ ఫలితాలు అందించిన ఆత్మవిశ్వాసం... రెట్టించిన ఉత్సాహం... వెరసి లోక్‌సభ ఎన్నికల్లో  క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అందుకోసం పక్కాగా సిద్ధమవుతోంది. ఢిల్లీని శాసించడమే తమ లక్ష్యమంటున్న తెరాస దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తమకు మద్దతు పలకాల్సిందిగా రాష్ట్ర ప్రజలను కోరుతూ బరిలోకి దిగుతోంది. ఎంఐఎంతో కలిసి రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లను గెలుచుకునేలా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యూహం రచించారు. వీటిలో 16 సీట్లను నేరుగా తన ఖాతాలో వేసుకునేందుకు తెరాస సైన్యం అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగింది. ఈ 16 లోక్‌సభ సీట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేలా కేసీఆర్‌ వ్యూహాన్ని అమలు చేయనున్న మంత్రులు, సమన్వయకర్తలు, నేతలతో సిద్ధమైన టీఆర్‌ఎస్‌ ఆర్మీ పైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తినెలకొంది.   -పిన్నింటి గోపాల్‌

ఆదిలాబాద్‌ (ఎస్టీ)
ఎస్టీ వర్గానికి రిజర్వు అయిన ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో గొడం నగేశ్‌కు టీఆర్‌ఎస్‌ మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.  గతంలో బోధ్‌ అసెంబ్లీ స్థానంలో నగేశ్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహించారు.  ఆదిలాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అప్పగించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి జోగు రామన్న ఇక్కడ కీలకం కానున్నారు. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు.

 పెద్దపల్లి (ఎస్సీ)
గత ఎన్నికలలో ఈ స్థానంలో ఎంపీగా గెలిచిన బాల్క సుమన్‌ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు సెగ్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జి.వివేకానంద తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వివేకానందకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఈ సెగ్మెంట్‌ బాధ్యతలను సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించారు. ఒక్క మంథని అసెంబ్లీ సెగ్మెంట్‌ మినహా అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.  

 కరీంనగర్‌
టీఆర్‌ఎస్‌ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌ కరీంనగర్‌లో  మూడోసారి పోటీ చేయబోతున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సెంటిమెంట్‌గా భావించే ఈ సెగ్మెంట్‌లో గెలుపు బాధ్యతలను వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు అప్పగించారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు సహా పార్టీ ముఖ్యనేతలు గంగుల కమలాకర్, చెన్నమనేని రమేశ్‌ వంటి వారు కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. 

నిజామాబాద్‌
సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత మళ్లీ  టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ సెగ్మెంట్‌లో పార్టీ గెలుపు బాధ్యతలను సమన్వయం చేయనున్నారు. సీనియర్‌ నేత బాజిరెడ్డి గోవర్ధన్, కె.విద్యాసాగర్‌రావు వంటి సీనియర్‌ ఎమ్మెల్యేలు కూడా ఈ సెగ్మెంట్‌లో కీలకం కానున్నారు.

 జహీరాబాద్‌
టీఆర్‌ఎస్‌ తరుపున బి.బి.పాటిల్‌ మరోసారి ఇక్కడ పోటీ చేయనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఆరు సెగ్మెంట్లలోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహంలో కీలకంగా వ్యవహరించనున్నారు.

 మెదక్‌
ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కీలక నేత హరీశ్‌రావుల అసెంబ్లీ సెగ్మెంట్‌లు కూడా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం తో పాటు మెజార్టీ కూడా ప్రాధాన్యత కలిగిందే.  గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చూసే అవకాశం ఉంది.   

మల్కాజిగిరి
గత 2014 ఎన్నికల్లో తమను రెండోస్థానానికి పరిమితం చేసిన మల్కాజ్‌గిరి లోక్‌ సభ స్థానంలో  గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఓటర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతి పెద్ద సెగ్మెంట్‌ కావడంతో బలమైన అభ్యర్థిని పోటీలో దించాలని భావిస్తోంది. టీఆర్‌ఎస్‌ నేతలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కె.నవీన్‌రావు, బండారి లక్ష్మారెడ్డిలో ఒకరికి ఇక్కడ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. గత  ఎన్నికల్లో ఈ స్థానంలో గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన సి.హెచ్‌.మల్లారెడ్డి ఇటీవల రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎన్నికల బాధ్యతలను సైతం టీఆర్‌ఎస్‌ అధిష్టానం మల్లారెడ్డికి అప్పగించింది. ఈ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో ఒక్క ఎల్బీనగర్‌ అసెంబ్లీ స్థానంలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద, మాధవరం కృష్ణారావు పార్టీ అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నారు.

 సికింద్రాబాద్‌
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఈ సెగ్మెంట్‌లో గెలుపుపై ఆ పార్టీ ధీమాతో ఉంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్, ఒక స్థానంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ఈ లోక్‌సభ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యతలను స్వీకరించారు. సీనియర్‌ ఎమ్మెల్యేలు తీగుళ్ల పద్మారావుగౌడ్, దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌ సైన్యంలో కీలకం కానున్నారు. తలసాని సాయి కిరణ్‌యాదవ్, బొంతు శ్రీదేవి యాదవ్, దండె విఠల్‌లో ఒకరికి ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వనుంది.  

చేవెళ్ల
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు.  ఈ స్థానం నుంచి పారిశ్రామికవేత్త జి.రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్, కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న పటోళ్ల కార్తీక్‌రెడ్డిలో ఒకరు  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కానున్నారు. కార్మిక మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డి ఈ సెగ్మెంట్‌లో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకున్నారు.. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ (ఒక వేళ టీఆర్‌ఎస్‌లో చేరితే మాజీ మంత్రి సబితారెడ్డి) ఇక్కడ  ఎన్నికల వ్యూహం అమలులో ముఖ్యలుగా ఉండనున్నారు. లోక్‌సభ పరిధిలోని తాండూరు సెగ్మెంట్‌ మినహా అన్నింట్లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు.  

 మహబూబ్‌నగర్‌
వరుసగా మూడోసారి ఈ స్థానంలో గెలుపుపై టీఆర్‌ఎస్‌ కన్నేసింది. సిట్టింగ్‌ ఎంపీ ఎ.పి.జితేందర్‌రెడ్డి, పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణరెడ్డిలో ఒకరు ఇక్కడ అభ్యర్థి కానున్నారు. ఎక్సైజ్‌ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఈ సెగ్మెంట్‌లో  గెలుపు బాధ్యతలను చూస్తున్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేత సి.లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహంలో కీలకంగా వ్యవహరించనున్నారు.

నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ)
ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ఒక్కసారీ విజయం సాధించని స్థానం ఇది. దీంతో ఇక్కడ గెలుపును పట్టుదలగా తీసుకున్న పార్టీ వ్యవసాయ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డికి ఇక్కడ పార్టీ ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. మాజీ మంత్రి పి.రాములు, గాయకుడు సాయిచంద్, మాజీ ఎంపీ మందా జగన్నాథంలో ఒకరికి ఈ సీటు దక్కే అవకాశం ఉంది. ఒక్క కొల్లాపూర్‌ మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  

 నల్లగొండ
సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోసారి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయితే తేరా చిన్నపరెడ్డి, వేముగంటి నర్సింహారెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తోంది. విద్యా మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డికి ఇక్కడ ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహించే హుజూర్‌నగర్‌ మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. సీనియర్‌ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, ఎన్‌.భాస్కర్‌రావు ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు కీలకంగా వ్యవహరించనున్నారు.  

 భువనగిరి
సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. సీఎం కేసీఆర్‌ ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను విద్యా మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డికి అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు, నకిరేకల్‌ మినహా మిగిలిన ఐదు సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. తాజాగా నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గొంగిడి సునీత పార్టీ గెలుపు వ్యూహంలో కీలకంగా వ్యవహరించనున్నారు.  

వరంగల్‌ (ఎస్సీ)
టీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి గట్టి పట్టున్న వరంగల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో విజయంపై ధీమాతో ఉంది. గత 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలిచిన సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.  ఈ సెగ్మెంట్‌లో గెలుపు బాధ్యతలను పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగించారు. ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్‌లు టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహంలో కీలకంగా వ్యవహరించనున్నారు. వరంగల్‌ సెగ్మెంట్‌ పరిధిలోని భూపాలపల్లి తప్ప మిగిలిన స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు.  

 మహబూబాబాద్‌ (ఎస్టీ)
గిరిజన ప్రాంతంతో కలిసి ఉన్న మహబూబాబాద్‌ సెగ్మెంట్‌లో  సిట్టింగ్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామచంద్రునాయక్‌లలో ఒకరికి ఇక్కడ టికెట్‌ దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఈ సెగ్మెంట్‌ పరిధిలోని మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచింది. కాంగ్రెస్‌ తరపున గెలిచిన రేగా కాంతారావు, బానోతు హరిప్రియ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.  ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యతలను పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగించారు.  

ఖమ్మం
టీఆర్‌ఎస్‌ ఖమ్మం స్థానాన్ని మొదటిసారి గెలిచే ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఈ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఒక్క ఖమ్మంలోనే గెలిచింది. దీంతో ఈ సెగ్మెంట్‌లో గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌లో ఒకరికి ఇక్కడ టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది.ఖమ్మం లోక్‌సభ పరిధిలోని వైరా ఎమ్మెల్యే రాములునాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.  వీరితో పాటు పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపులో కీలకంగా వ్యవహరించనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top