
అధికారంలో ఉన్న పార్టీ పక్కన చేరడం మజ్లిస్ నైజం
హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తానన్న వ్యక్తి ఫాంహౌస్‌లో పడుకున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
పెద్దమ్మ గుడి 11 ఎకరాల భూములు ఎంఐఎంకు: బండి సంజయ్
కాంగ్రెస్‌కు హామీల అమలుపై చిత్తశుద్ధి లేదు: రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ని ఎంఐఎం నేతలు నిర్ణయించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి ని ప్రకటించిన వెంటనే మజ్లిస్ నేతలు కలసి, తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కలో చేరడం మజ్లిస్‌కు అలవాటేనన్నారు. కిషన్‌రెడ్డి మంగళవారం బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా యూసఫ్‌గూడలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. ‘బీఆర్‌ఎస్ పనైపోయింది. ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లే. హైదరాబాద్‌ను లండన్, న్యూయార్క్, వాషింగ్టన్, సింగపూర్‌గా మారుస్తా అన్న వ్యక్తి ఫాంహౌస్‌లో పడుకున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజీనామా చేసిన తరువాత ఫాంహౌస్ నుంచి బయటకు రాని వారికి ఓటు వేస్తామా’అని అన్నారు. జూబ్లీహిల్స్ అంటే అక్కడ అన్నీ అద్దాల మేడలని ప్రజలకు ఒక దురభిప్రాయం ఉందని, ఇక్కడ వీధుల్లో చూస్తే మురుగు నీరు, చెత్త, వెలగని వీధి లైట్లు, పార్కుల కబ్జాలు కనిపిస్తాయని పేర్కొన్నారు.
గుడి భూములు ఎంఐఎంకు: బండి సంజయ్
జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయానికి చెందిన 11 ఎకరాలను ఎంఐఎం పార్టీ వారికి రాసివ్వడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సల్కం చెరువులో ఎంఐఎం కాలేజీ కడితే వారితో కాంగ్రెస్ నేతలు భాగస్వామ్యం పెట్టుకున్నారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో సైకిల్‌కి కూడా గతి లేని నాయకులు ఇప్పుడు కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు వేసుకుని, పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై మేం మాట్లాడం, మూసీపై మీరు మాట్లాడకండి అంటూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం నడుస్తోందని ఆరోపించారు.
ఎంఐఎంలో ఇద్దరు జోకర్లు ఉన్నారని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి చెరో రూ.200 కోట్లు తెచ్చుకుని, పతంగి పార్టీని యూసఫ్‌గూడ చౌరస్తాలో వేలం వేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరకలేదని, అందుకే మజ్లిస్ నుంచి ఒక వ్యక్తిని అద్దెకు తెచ్చుకున్నారని బీజేపీ రాష్త్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని, దానికి జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు పాల్గొన్నారు.