
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి
ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు చాలా అవసరం
ఇప్పటివరకు బాగా పని చేశారు.. ఇకనుంచి ప్రతీరోజూ కీలకమే
అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది
గెలిపించాల్సిన బాధ్యత పార్టీ నేతలదే
ముఖ్యనేతలతో సీఎం సమీక్ష
సాక్షి హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు చాలా అవసరమని, పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిపించాల్సిన గురుతర బాధ్యత ఇన్‌చార్జిలపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం పార్టీ నాయకత్వం ఇప్పటివరకు చాలా బాగా పని చేసిందని, ఇకపై ప్రతీరోజూ కీలకమని, ఈ ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని వ్యవహారాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ఆయన వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆదివారం సాయంత్రం తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ, సాంస్కృతిక విభాగం చైర్మన్ వెన్నెల గద్దర్‌తో పాటు పార్టీ డివిజన్ ఇన్‌చార్జులుగా పనిచేస్తున్న కార్పొరేషన్ చైర్మన్‌లు పాల్గొన్న ఈ సమావేశంలో.. ఉప ఎన్నికలో గెలుపునకు అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలి..
పార్టీ నేతలందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ సూ చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరేలా కృషి చేయా లని ఆదేశించారు. ’జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచా రం చేయాలి. పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించాలి. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది. అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’ అని సీఎం స్పష్టం చేశారు. కాగా, ఈనెల 21వ తేదీ కల్లా నియోజకవర్గంలోని 407 పోలింగ్ బూత్‌లలో ప్రతి బూత్‌కు పదిమంది చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు.