కలిసొచ్చినట్టు కనికట్టు! | cybercrime threat in Telangana | Sakshi
Sakshi News home page

కలిసొచ్చినట్టు కనికట్టు!

Dec 21 2025 6:17 AM | Updated on Dec 21 2025 6:17 AM

cybercrime threat in Telangana

సోషల్‌ మీడియా ద్వారా లింకులు పంపుతూ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట అమాయకులకు సైబర్‌ నేరగాళ్ల వల 

యాప్‌ల ద్వారా ట్రేడింగ్‌ ఖాతాలు తెరిపించి భారీగా పెట్టుబడుల ఆకర్షణ 

రూ. కోట్లలో లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపుతూ మాయ 

చివరకు అందినకాడికి దండుకొని ట్రేడింగ్‌ యాప్‌లు, ఖాతాలు మూసేస్తున్న వైనం

హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగి (63)కి ఇండియా నివేశ్‌ షేర్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ పేరుతో వాట్సాప్‌నకు గత నెలలో ఓ లింక్‌ వచ్చింది. లింక్‌ను ఆయన ఓపెన్‌ చేయగానే దివ్య మెహ్రాగా చెప్పుకున్న ఓ మహిళ వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా మాటలు కలిపి ఆయన్ను 163 గేట్‌ వే టు ది ఫ్యూచర్‌ అనే వాట్సాప్‌ ట్రేడింగ్‌ గ్రూప్‌లో చేర్చింది. అలాగే ఎన్‌ఐవీపీఆర్‌ఓ ట్రేడింగ్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించి కొంత సొమ్మును అందులో డిపాజిట్‌ చేయించింది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో ఆయన పెట్టుబడి ఏకంగా రూ. 64 లక్షలకు పెరిగినట్లు వర్చువల్‌గా బ్యాలెన్స్‌ చూపించింది. చివరకు ఆ ఖాతా ఫ్రీజ్‌ అయ్యిందంటూ రూ. 29.5 లక్షలు కొల్లగొట్టింది. దీంతో 
బాధితుడు సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎల్బీ నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఈ ఏడాది ఆగస్ట్‌ 20న ఆర్తి అనే మహిళ పేరు, ఫొటో ఉన్న వాట్సాప్‌ నంబర్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. ఆ తర్వాత ఆమె పరిచయం పెంచుకొని 305 స్టాక్‌ మార్కెట్‌ న్యూస్‌ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో అతన్ని చేర్చింది. ఆ గ్రూప్‌లోని సభ్యులు తమకు అధిక లాభాలు వస్తున్నట్లు నమ్మించడంతో ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సైతం ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు సిద్ధపడ్డాడు. దీంతో తొలుత అతనితో రూ. 50 వేలు డిపాజిట్‌ చేయించి 4.69 శాతం లాభం వచ్చినట్లు చూపారు. ఇలా 50 రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 3.49 కోట్లు పెట్టుబడి పేరిట వసూలు చేసి రూ. 28.52 కోట్లు లాభం వచ్చినట్లు వర్చువల్‌ ఖాతాలో బ్యాలెన్స్‌ చూపారు. ఈ డబ్బు విత్‌ డ్రాకు బాధితుడు యతి్నంచగా అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందని చెప్పి ట్రేడింగ్‌ యాప్‌ను, వాట్సాప్‌ గ్రూప్‌ను డిలీట్‌ చేసి జారుకున్నారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రెండు రోజుల కిందట నలుగురిని అరెస్టు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్లు లాభాలు వస్తాయని మెసేజ్‌లు, వెబ్‌ లింక్‌లతో ఊదరగొడుతూ వారిని మోసాల ఊబిలోకి దింపుతున్నారు. పెట్టుబడికి భారీగా లాభాలు వచ్చినట్లు వర్చువల్‌ ఖాతాల్లో కనికట్టు చేస్తున్నారు. తీరా సొమ్ము విత్‌డ్రాకు ప్రయతి్నస్తే ఖాతాలను బ్లాక్‌ చేసి బాధితుల నుంచి రూ. కోట్లలో దండుకుంటున్నారు. 

మోసగాళ్ల పంథా ఇదీ.. 
సైబర్‌ నేరగాళ్లు గుర్తుతెలియని వాట్సాప్‌ నంబర్ల ద్వారా బాధితులకు తొలుత బల్క్‌ మెసేజ్‌లు పంపుతూ నకిలీ పేర్లు, మహిళల ఫొటోలతో ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకుంటున్నారు. బాధితుడు తమను నమ్మినట్లు తెలియగానే ముందుగానే ఏర్పాటు చేసిన మోసపూరిత వాట్సాప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌లలో సభ్యులుగా చేరుస్తున్నారు. నెలల వ్యవధిలోనే అనూహ్య లాభాలు గడించినట్లు గ్రూప్‌ సభ్యుల మధ్య చర్చ నడుపుతూ బాధితులను సైతం అందులో చేరాల్సిందిగా కోరుతున్నారు. ఆ తర్వాత తాము డిజైన్‌ చేసిన యాప్‌లలో వారిని చేర్చి వర్చువల్‌ ఖాతాకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. తక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కలి్పంచి ఆశచూపుతున్నారు.

కమీషన్లు, రివార్డు పాయింట్ల పేరిట మళ్లీమళ్లీ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేలా వల విసురుతున్నారు. ఇలా పెట్టిన పెట్డుబడితో లాభాలు వచ్చినట్లు ఆన్‌లైన్‌ ఖాతాల్లో బ్యాలెన్స్‌ చూపుతున్నారు. అయితే ఆ సొమ్ము విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. డబ్బు బదిలీ కావాలంటే పన్నులు, చార్జీలు, మనీలాండరింగ్‌ పేరు చెప్పి అందినంత దోచేస్తున్నారు. చివరకు అకౌంట్‌ను డిలీట్‌ చేసేస్తున్నారు. రాష్ట్రంలో నమోదైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌ కేసుల్లో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 10 వేలకుపైగా వర్చువల్‌ ఖాతాలను గుర్తించారు. 

చివరి వరకు అదే డ్రామా 
ట్రేడింగ్, ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట సైబర్‌ నేరాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాధితుల వర్చువల్‌ ఖాతాల యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లను సైబర్‌ నేరగాళ్లు వారి వద్దే పెట్టుకుంటారని, దీంతో సమాచారమంతా వారి చేతుల్లోనే ఉంటోందని వివరిస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి మొదట్లో రెట్టింపు లాభం చూపుతున్న కేటుగాళ్లు.. అందులోనూ బాధితుడు పెట్టిన సొమ్ము నుంచే కొంత మొత్తం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చి నమ్మకం కలిగేలా చేస్తున్నారని.. ఇలా ట్రాప్‌లో చిక్కిన వారి నుంచి అందినంత కొల్లగొడుతున్నారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement