అభ్యర్థుల ర్యాంకుల జాబితా రెడీ..
రెండ్రోజుల్లో విడుదల చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. గత సంవత్సరం నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మందికిపైగా నర్సింగ్ అభ్యర్థులు పరీక్ష రాసి ఎదురుచూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) పోస్టుల ఫలితాలను ఒకటి రెండు రోజుల్లోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల జాబితాను సిద్ధం చేశామని, ఫలితాల ప్రకటన దశలో ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే రెండ్రోజుల్లోనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజల్ట్, ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసే అవకాశముందని సమాచారం.
2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం 2024 నవంబర్ 23న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా 2,322 పోస్టులు భర్తీ చేయనున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులు, సేవా అనుభవానికి కేటాయించిన వెయిటేజీ పాయింట్లు కలిపి 100 మార్కుల ఆధారంగా మెరిట్ సిద్ధం చేసినట్టు బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఫలితాల విడుదల అనంతరం, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసి, ఎంపికైన వారికి ని యామక ఉత్తర్వులు అందించే ప్రక్రియను ఆరోగ్య శాఖ వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గతేడాది 7 వేలకుపైగా పోస్టుల భర్తీ
తెలంగాణలో నర్సింగ్ నియామకాల పరంగా గత రెండేళ్లలో ప్రభుత్వం వేగం పెంచింది. 2022లో నోటిఫై చేసిన 7,094 స్టాఫ్‌నర్స్ పోస్టుల్లో 6,956 మందిని గతేడాది ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 36కు చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెరిగింది. ఈ ఆస్పత్రుల్లో నర్సింగ్ సిబ్బంది నియామకం అత్యవసరమని ఆరోగ్య శాఖ చెబుతోంది. కొత్తగా నియమితులయ్యే నర్సింగ్ ఆఫీసర్లు సేవల్లోకి రాగానే ఐసీయూ, మెటర్నిటీ, పిల్లల, అత్యవసర చికిత్స వార్డుల్లో రోగి సంరక్షణ మరింత మెరుగుపడనుందని అధికారులు భావిస్తున్నారు.


