
జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించండి
మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
శేరిలింగంపల్లి/బండ్లగూడ: (హైదరాబాద్): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారుకు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు కోరారు. మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి లింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్షాకోట్‌లో హైడ్రా కూల్చివేతల బాధితుల దీపావళి పండుగలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.
‘రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..బస్తీల ప్రజలకు ఇబ్బంది కలగవద్దని, గడప దగ్గరలోనే వైద్య సేవలు అందించేలా రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. అందులో 350 బస్తీ దవాఖానాలను ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేస్తే, ఇప్పుడు వాటిని నిర్వీర్యంగా మార్చారు. కనీసం బీపీ మీటర్లు కూడా పనిచేయడం లేదు.
గతంలో బస్తీ దవాఖానాలలో 134 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తూ 110 రకాల మందులు అందించే వాళ్ళం. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటికి సుస్తీ పట్టింది. ప్రస్తుతం 60 నుంచి 70 రకాల మందులే ఇస్తున్నారు. 40 రకాల మందులు సరఫరా చేయడం లేదు. వైద్య పరీక్షలు కూడా అన్నీ జరగడం లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి. సీఎం సొంత నియోజకవర్గంలోనే 108 సర్వీస్ సకాలంలో రాక, వైద్యం సకాలంలో అందక మనిషి ప్రాణం పోయింది..’అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదు
‘ఆస్పత్రులలో కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వల్ల 20 శాతం ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలి వెళుతున్నారు. రూ.1,400 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండగా.. వాటిని చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా మారిందో అర్థమవుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నటికీ బీజేపీతో కలవదు. మాది లౌకిక పార్టీ. కానీ కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నగరంలో పేదల ఇళ్లు కూల్చడం ఆగాలన్నా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రేవంత్‌రెడ్డి నయా నరకాసురుడు.
ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వారికి కునుకు లేకుండా చేస్తోంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటేస్తే బస్తీ దవాఖానాల్లో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేశారని రేవంత్‌రెడ్డి అనుకుంటాడు. అందుకే ప్రజలంతా బీఆర్‌ఎస్‌కే ఓటెయ్యాలి. హైదర్షాకోట్ అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు తమకు అండగా ఉండాలని కోరారు. మీ కష్టాల్లో అండగా ఉన్నది బీఆర్‌ఎస్ పారీ్టయే..’అని హరీశ్‌రావు చెప్పారు. పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.