
మైనారిటీ వర్గం వైపే కాంగ్రెస్ మొగ్గు!
గత ఎన్నికల్లో పోటీ చేయడాన్నీ
పరిగణనలోకి తీసుకుంటున్న అధిష్టానం
ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలకు పార్టీ పదును
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీచేసే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ క్రమంగా వీడుతోంది. ఈ సీటు కోసం మైనార్టీ, కమ్మ, బీసీ సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వైపే ఈసారి కూడా పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి అభ్యరి్థని ఎంపిక చేసే అంశం కూడా పరిశీలనలో ఉందని, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌ను బరిలో దించే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకోవైపు బీసీ కోటాలో నవీన్ యాదవ్ పేరు కూడా విన్పిస్తున్నా.. మైనార్టీ వర్గం వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అభిప్రాయం పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది.
ప్రతి మంత్రి పరిధిలో కొందరు చైర్మన్లు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఏడాది అక్టోబర్‌లో ఉప ఎన్నిక జరగవచ్చనే అంచనాలో ఉన్న అధికార కాంగ్రెస్ ఇప్పటినుంచే గెలుపు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌లకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. తాజాగా 25 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా రంగంలోకి దింపింది. ప్రతి మంత్రి పరిధిలో కొందరు చైర్మన్లు బూత్‌స్థాయిలో పనిచేసేలా కార్యాచరణ రూపొందించింది.
కార్పొరేషన్ చైర్మన్లు కేస వేణు, పటేల్ రమేశ్‌రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, మువ్వా విజయ్‌బాబు, మానాల మోహన్‌రెడ్డి, బండ్రు శోభారాణి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గుత్తా అమిత్‌రెడ్డి, ఇనగాల వెంకట్రామిరెడ్డి, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్, తాహెర్ బిన్ అహ్మద్, లక్ష్మణ్ యాదవ్, రాయల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, ఈరవత్రి అనిల్, జంగా రాఘవరెడ్డి, రియాజ్, ఎన్.ప్రీతంలను ముగ్గురు మంత్రుల పరిధిలో పనిచేయాల్సిందిగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆదేశించారు. సోషల్ మీడియాకు మన్నె సతీశ్, సాంస్కృతిక బృందాలకు పుంజాల అలేఖ్య, వెన్నెల, వికలాంగ ఓటర్ల ప్రచారానికి ముత్తినేని వీరయ్య వర్మలు సారథ్యం వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కార్పొరేషన్ చైర్మన్లతో.. మంత్రి పొన్నంతో కలిసి మరో మంత్రి తుమ్మల నాగేశ్వరావు తన నివాసంలో భేటీ అయ్యారు. పోలింగ్ బూత్ స్థాయిలో అమలు చేయాల్సిన కార్యాచరణపై వారితో చర్చించారు.