బిహార్‌లో 17శాతానికి పైగా ముస్లిం ఓటర్లు
87 నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం
28 మందిని రంగంలోకి దించిన కాంగ్రెస్, ఆర్‌జేడీ
కేవలం ఆరుగురితో సరిపెట్టిన ఎన్‌డీయే
‘చీలిక’పై కమలం ఆశ.. ‘ఏకీకరణ’పై కూటమి భరోసా
’పస్మాందా’కార్డుతో కమలం వ్యూహం
సీమాంచల్‌లో గట్టి పోటీ ఇవ్వనున్న ఎంఐఎం
సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి
(బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
ఎన్నికల రణక్షేత్రంలో కులమే కేంద్ర బిందువైన బిహార్‌లో ముస్లిం ఓటర్లు సైతం పారీ్టల గెలుపోటముల్లో క్రియాశీలకంగా మారారు. రాష్ట్రంలోని మూడోవంతు నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్న వీరే ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో ఉన్నారు. ముస్లిం–యాదవ్ ఫార్ములానే నమ్ముకున్న ఇండియా కూటమి వీరంతా తమకే అనుకూలమని భావిస్తోంది.
డిప్యూటీ సీఎం పదవిని తమ వర్గానికి ఇవ్వకపోవడంతో వారిలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం అగ్గిని రాజేయనున్నాయో తెలియాల్సి ఉంది. ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు తమను మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన విన్నపాన్ని పెడచెవిన పెట్టడం ఇండియా కూటమికి పరీక్షగా మారింది. అదే సమయంలో, ముస్లింలలోని వెనకబడిన కులాల ఓట్లను రాబట్టుకునేందుకు ఎన్‌డీయే కూటమి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి.
మైనారిటీ వంతెన దాటాల్సిందే..
బిహార్‌లోని మొత్తం 10.41 కోట్లు జనాభాలో 1.75 కోట్ల ముంది ముస్లింలు అంటే 17.7 «శాతం మంది. మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 87 చోట్ల 20 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉంది. మరో 47 స్థానాల్లో 15 నుంచి 20 శాతం మధ్య ముస్లింలున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో పార్టీ ఏదైనా గెలుపు గుర్రం ఎక్కాలంటే మైనారిటీ ఓట్ల వంతెన దాటాల్సి ఉంటుంది.
బిహార్ రాజకీయాల్లో మైనారిటీల ప్రభావం గురించి మాట్లాడాలంటే మొదట ప్రస్తావించాల్సింది రాష్ట్ర ఈశాన్య మూలన ఉన్న ’సీమాంచల్’ప్రాంతం గురించే. కిషన్‌గంజ్, అరియా, కతిహార్, పూర్ణియా జిల్లాల పరిధిలోని సుమారు 24 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయం మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. కిషన్‌గంజ్ జిల్లాలో మైనారిటీల జనాభా ఏకంగా 70శాతం కాగా, అరియా, కతిహార్, పూరి్ణయా జిల్లాల్లో 30–45శాతం వరకు ఉంది. అమౌర్, బైసి, జోకిహాట్, కోచాధామన్ వంటి నియోజకవర్గాల్లో 50–60శాతం పైగా వీరే ఉన్నారు.
గత ఎన్నికలే గుణపాఠం
2020 ఎన్నికలు ఇక్కడి సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతత్వంలోని ఎంఐఎం పార్టీ మహాగఠ్‌బంధన్ ఓట్లను చీలి్చంది. ఏకంగా 5 చోట్ల అమౌర్, బైసి, జోకిహాట్, బహదూర్‌గంజ్, కోచాధామన్‌లలో జెండా ఎగరేసింది. ఈ ఐదు స్థానాల నష్టమే తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి పీఠానికి కేవలం 12,000 ఓట్ల తేడాతో దూరం చేసిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యమున్న ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోరినా ఆర్‌జేడీ స్పందించలేదు. దీంతో ఆయన తమ అభ్యర్థులను 8 చోట్ల నిలబెట్టారు. దీంతో, తమకున్న సొంత ముస్లిం ఓట్లతో పాటు యాదవ ఓట్లు దూరమవుతాయనే ఆందోళన ఆర్జేడీని వెంటాడుతోంది. ఎంఐఎంను చేర్చుకోవడంపై కాంగ్రెస్‌కు ఉన్న అయిష్టత మరో కారణం.
ఏకీకరణను నమ్ముకున్న ఇండియా కూటమి
సీమాంచల్ వెలుపల, మైనారిటీలు 15– 25 శాతం వరకు ఉండే అనేక ’స్వింగ్’నియోజకవర్గాలు ఉన్నాయి. దర్భంగా, మధుబని (మిథిలాంచల్), సివాన్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, భగల్‌పూర్ వంటి ప్రాంతాల్లో వీరు ఒంటరిగా గెలిపించలేరు, కానీ వీరి ఓట్లు ఎవరికి పడితే వారే గెలుస్తారు. ఇక్కడే ఆర్జేడీ అజేయమైన ముస్లిం–యాదవ్ సమీకరణం బలంగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని 17.7 శాతం ముస్లింలు, 14 శాతం యాదవులు కలిస్తే, అది దాదాపు 32 శాతం పటిష్టమైన ఓటు బ్యాంకుగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్‌జేడీ కలిసి 20 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టారు. బీజేపీతో కలిసి ఉన్నందున ముస్లింలు తమతో కలిసిరారన్న కారణంతో జేడీయూ గతంలో 10 సీట్ల సంఖ్యను 6కు తగ్గించింది.
చీలికపై నితీశ్ ఆశలు..!
నితీశ్ కుమార్ ‘మహాగఠ్‌బంధన్’లో ఉన్నంత వరకు మైనారిటీ ఓటర్లకు అది సురక్షితమైన కూటమి. ఆర్జేడీ ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకుకు, నితీశ్ ‘ఈబీసీ’ఓట్లు తోడై అది అజేయమైన కూటమిగా కనిపించింది. కానీ, నితీశ్ ఇప్పుడు బీజేపీ భాగస్వామిగా ఉండడంతో మైనారిటీ ఓటర్లు సందిగ్ధంలో పడ్డారు. నితీశ్ కుమార్, బీజేపీతో ఉన్నప్పటికీ, మైనారిటీలలోని అట్టడుగు వర్గా లైన ‘పస్మాందా’(వెనుకబడిన కులాలు) ముస్లింలను ఆకట్టుకునే ప్రయ త్నం దశాబ్దాలుగా చేస్తున్నారు. ‘ఆర్జేడీ కేవలం అగ్రవర్ణ (అష్రాఫ్) ముస్లింలకే పెద్ద పీట వేసింది, పస్మాందాల అభివృద్ధికి మేమే పాటుపడ్డాం’అనేది నితీశ్, బీజేపీల ఉమ్మడి ప్రచారాస్త్రం. ఈ ‘పస్మాందా’కార్డు ద్వారా మైనారిటీ ఓట్లలో 5–10శాతం చీల్చగలిగినా, అది అనేక నియోజకవర్గాల్లో మహాగఠ్‌బంధన్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుంది
ఎంఐఎం ఆత్మగౌరవ నినాదం
ఒవైసీ పార్టీ ‘ఓటు బ్యాంకు’గా ఉండటానికి బదులు, ‘సొంత రాజకీయ నాయకత్వం’కోసం పిలుపునిస్తోంది. ‘మీరు ఎల్లప్పుడూ బీజేపీని ఓడించడానికే కాదు, మీ హక్కుల కోసం, మీ నాయకత్వం కోసం ఓటేయండి. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు మిమ్మల్ని వాడుకున్నాయి’అనే అసదుద్దీన్ ఒవైసీ నినాదం సీమాంచల్‌లోని యువతను ఆకట్టుకుంటోంది. 2020 నాటి ప్రదర్శనను పునరావృతం చేసి, 10–15 శాతం ఓట్లు చీల్చగలిగితే..అది నేరుగా ఎన్డీయేకు లాభం చేకూరుస్తుంది.
సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి
(బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)


