
సాక్షి, హైదరాబాద్ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యానికి, నియంతకు మధ్య యుద్ధం జరుగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గాంధీ ఆలోచనలను శాంతి ర్యాలీ ద్వారా కార్యకర్తలకు తెలియజెప్పామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థి సంఘాలను, పత్రికలను, జర్నలిస్టులతో పాటు ప్రశ్నించే పార్టీలను కూడా లేకుండా చేయాలని టీఆర్‌ఎస్ చూస్తోందన్నారు. సూర్యాపేట జిల్లాలోని సాయుధ పోరాటంలో పాల్గొన్నవారంతా ఆలోచన చేసి.. ప్రజాస్వామ్యవాదులు లేకుండా చేయాలని చూస్తోన్న టీఆర్‌ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఐ అధినాయకత్వం టీఆర్‌ఎస్‌తో వెళ్లినా.. సీపీఐ, సీపీఎం కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. మునిగిపోయే నావకు మీరు ఎందుకు భయపడుతున్నారని, ఆ నావలోని 12 మంది ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. మునిగే నావ ఎవరిదో త్వరలోనే తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
అదే విధంగా మంత్రి పదవి ఎవడి భిక్ష కాదని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ అన్న మాటలను విక్రమార్క గుర్తు చేస్తూ.. మీ పార్టీలో యుద్ధం మొదలయ్యిందని అన్నారు. 6 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్రాన్ని ముంచి దివాలా తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీరు చెప్పే మాటలకు నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదు. మీ పార్టీ త్వరలో మునిగిపోతుంది.. నువ్వు మునిగి పోతావో లేక పక్కకు వస్తావో తేల్చుకో అంటూ ఈటలకు సూచించారు. ఈ కార్యక్రమంలో విక్రమార్క తో పాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ది కోసం పాటు పడ్డారు గనుక కాంగ్రెస్‌ను గెలిపించాలని హుజూర్‌నగర్ ప్రజలకు విజ్జప్తి చేశారు. ధన బలంతో టీఆర్‌ఎస్ గెలవాలని చూస్తోందని.. అది మునిగిపోయే నావ అందుకే కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని తెలిపారు. ఇక కుసుమ కుమార్ మాట్లాడుతూ.. ‘మా మెజార్టీ తగ్గించడానికి అంగ బలం ,ధన బలం వాడుతుంది. కానీ ఈ ఎన్నికల్లో గెలిచేది మేమే’ అని ధీమా వ్యక్తం చేశారు.