నా సైన్యం 70 లక్షలు | Sakshi
Sakshi News home page

నా సైన్యం 70 లక్షలు

Published Mon, May 28 2018 2:13 AM

Chandrababu Says My army is 70 lakhs People - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీకి పెద్ద సైన్యం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 60 లక్షల మంది, తెలంగాణలో 10 లక్షల మంది కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. ప్రపంచంలోని వందల దేశాల్లో టీడీపీ మహానాడు జరుపుకునే రోజు వస్తుందన్నారు. విజయవాడ సమీపంలోని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు మాట్లాడారు.

కేంద్రంలో ఏ పనీ అయ్యే పరిస్థితి లేదని, మాటలు ఎక్కువ చెబు తున్నారు తప్ప పనులు మాత్రం జరగడం లేదని  విమర్శించారు. అంతా ప్రచార అర్భాటమేనని, నరేంద్ర మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమేనని అన్నారు. మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛ భారత్, జనధన్, స్కిల్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని తేల్చిచెప్పారు. బీజేపీ హయాంలో బ్యాంకులన్నీ దివాలా తీస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో బ్యాంకుల్లో రూ.29,916 కోట్ల అవినీతి జరగ్గా, నాలుగేళ్ల బీజేపీ పాలనలో రూ.1.11 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు భారీగా పెరిగిపోయాయని, పరిపాలన గాడి తప్పే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. కేంద్రం తీరు వల్ల అందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహానాడులో చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే...  

‘‘వ్యవసాయం పూర్తిగా దివాళా తీసే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో బీజేపీ ఆటలు సాగలేదు. అక్కడ ఆ పార్టీ నాయకుల టేపులు దొరికాయి. ఇక బీజేపీ ఏ విధంగా నీతివంతమైన పార్టీ? దక్షిణ భారతదేశంలో దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చూస్తోంది. బీజేపీకి అధికారంపైన ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదు. దేశంలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. బీజేపీ అసలే రాదు. మళ్లీ ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయి. ఆ పార్టీల నాయకులను దెబ్బ తీయాలనుకుంటే బొబ్బిలి పులుల్లా తిరిగొస్తారు, కొండవీటి సింహాల్లా గర్జిస్తారు. తెలుగు జాతి కోసం హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించా. నా కష్టార్జితాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తోంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మళ్లీ టీడీపీ అధికారం రావాలి. టీడీపీ గెలవడం ఒక చారిత్రిక అవసరం. 25 ఎంపీ సీట్లు సాధించాలి. కేంద్ర ప్రభుత్వంలో 61 శాతం అవినీతి ఉందని ఒక సర్వేలో తేలింది. వాళ్లు(కేంద్రం) చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు.  
 
నాలుగేళ్లలో బీజేపీ ఏమైనా చేసిందా? 
నేను సవాల్‌ చేసి అడుగుతున్నా. బీజేపీ వాళ్లు ఈ నాలుగేళ్లలో చేసింది ఏమైనా ఉందా? బీజేపీ మాకు నమ్మకద్రోహం చేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏదోవిధంగా తప్పించుకునేలా అడ్డదారులు వెతుకుతున్నారు. గట్టిగా అడిగితే మాపై కుట్రపూరితమైన రాజకీయాలు చేశారు. అవసరమైతే దేశ రాజకీయాలను మార్చే శక్తి టీడీపీకి ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. విభేదించిన వారిని ఇబ్బంది పెట్టే అలవాటు బీజేపీకి ఉంది. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించారు.  

టీటీడీని కబ్జా చేయాలనుకున్నారు 
రాష్ట్రంలోని వెంకటేశ్వరస్వామిని కేంద్రంలోని నరేంద్ర మోదీ కబ్జా చేయాలనుకున్నారు. వెంకటేశ్వరస్వామి జోలికి ఎవరు వచ్చినా ఊరుకోం.. ఖబడ్దార్‌. తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే శిక్ష అనుభవించక తప్పదు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఎప్పుడో నగలు దొంగతనం జరిగాయని, లేని వజ్రాలున్నాయని బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది బీజేపీ కుట్రలో భాగమే. నవ్యాంధ్రలో సమస్యలను పరిష్కరించడం కోసమే క్లెమోర్‌ మైన్ల దాడి నుంచి 2003లో వెంకటేశ్వరస్వామి నన్ను కాపాడారు’’ అని చంద్రబాబు తెలియజేశారు. మహానాడులో చంద్రబాబు తొలుత డ్వాక్రా బజార్, ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతి చెందిన టీడీపీ కార్యకర్తలకు సంతాపం తెలిపారు. ఏపీ, తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శులు వర్ల రామయ్య, బుచ్చిలింగం పార్టీ పరిస్థితులపై తమ నివేదికలు సమర్పించారు.   

Advertisement
Advertisement