కోడెల మృతిపై బాబు రాజకీయం!

Chandrababu politics over the death of Kodela Siva Prasada Rao - Sakshi

మాజీ స్పీకర్‌పై రాజకీయ వేధింపులెక్కడ? 

అరెస్టు లేదు.. కనీసం విచారణకూ  పిలవలేదు

బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు రావటంతో కేసులు నమోదు చేసిన పోలీసులు

అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలింపును స్వయంగా ఒప్పుకున్న కోడెల

ఇవన్నీ నిజం కావడంతో మూడు నెలలుగా నోరు మెదపని చంద్రబాబు 

ఇప్పుడు చనిపోయాక ప్లేటు ఫిరాయింపు.. రాజకీయ లబ్ధికి యత్నం

కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే కోడెల చనిపోయినట్లు అనుమానాలు 

సాక్షి, అమరావతి: ‘కే ట్యాక్స్‌’పై సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బాధితుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడం, అసెంబ్లీ నుంచి ఫర్నిచర్‌ తరలించిన విషయాన్ని స్వయంగా కోడెల అంగీకరించడం, ఇతర అవినీతి వ్యవహారాలన్నీ నిజమేనని తేలడంతో ఇన్నాళ్లూ నోరు మెదపని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు రాజకీయ వేధింపుల వల్లే కోడెల మృతి చెందినట్లు ఆరోపణలకు దిగటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మూడు నెలలుగా కోడెల అవినీతి వ్యవహారాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా చంద్రబాబు, టీడీపీ నేతలు ఏరోజూ స్పందించే ప్రయత్నం చేయలేదు. కానీ కోడెల మృతి చెందగానే వెంటనే రంగంలోకి దిగి రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయడంపై అంతా విస్తుపోతున్నారు. 

గుండెపోటుకు గురైనా పరామర్శించని వైనం..
వాస్తవానికి కోడెలను కానీ ఆయన కుమారుడుని కానీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఇన్ని కేసులున్నా కనీసం విచారణకు సైతం పోలీసులు పిలవలేదు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే కోడెల ట్యాక్స్‌పై కేసులు పెట్టడం, అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలింపుతోపాటు కోడెల కుమారుడు, కుమార్తె స్కాములు భారీగా బయటపడ్డాయి. ఇవన్నీ నిజమేనని తెలియడంతో చంద్రబాబు ఇన్నాళ్లూ నోరు మెదపకుండా మిన్నకుండిపోయారు. నెల రోజుల క్రితం కోడెల గుండెపోటుకు గురైనా చంద్రబాబు కనీసం పరామర్శించలేదు. కోడెలతో ఫోన్‌లో మాట్లాడేందుకు సైతం ఇష్టపడలేదు. సత్తెనపల్లి నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇన్‌చార్జిని నియమించేందుకు కూడా కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కోడెల అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో చంద్రబాబు రూటు మార్చేశారు. 

వేధింపులంటూ చనిపోయాక రాజకీయాలు కోడెల అవినీతి నిజమేనని  స్పష్టమవడంతో ఆయన్ను పక్కన పెట్టిన చంద్రబాబు చనిపోయాక రాజకీయాలు చేయడం చర్చనీయాంశమైంది. కోడెల కుటుంబం అరాచకాలకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేయడమే తప్ప ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలింపు వ్యవహారంలో హైకోర్టులోనే వాస్తవాలు బహిర్గతమవగా కోడెల స్వయంగా తాను వాటిని ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎవరూ కోడెలకు మద్దతుగా మాట్లాడే సాహసం చేయలేదు. కానీ ఆయన మృతి చెందిన తర్వాత ఉన్నట్టుండి రాజకీయ వేధింపులని గగ్గోలు పెడుతుండడం గమనార్హం. నిజంగా కోడెలపై రాజకీయ వేధింపులుంటే ఈపాటికి చంద్రబాబు చేసే రచ్చను ఊహించలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునే చంద్రబాబు ఇటీవల గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఒక కుటుంబం మధ్య జరిగిన గొడవపై జాతీయ స్థాయిలో హడావుడి చేసిన విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు కోడెల ఉదంతంలో ఇన్నాళ్లూ గప్‌చుప్‌గా ఉండడానికి ఆయన అవినీతి నిజమేనని తేలడమే కారణం.  

మృతిపై పలు అనుమానాలు..
కోడెల కుటుంబంలో కలహాలు కూడా చంద్రబాబు దృష్టికి ఎప్పుడో వెళ్లాయి. ఆయన కుమారుడు, కుమార్తె అవినీతి వ్యవహారాలపై చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడే చాలామంది ఫిర్యాదులు చేశారు. కోడెల కుమారుడి వ్యవహార శైలి బాగోలేదని స్వయంగా చంద్రబాబు పలుసార్లు అంతర్గత సమావేశాల్లో హెచ్చరించారు. ఇప్పుడు కోడెల మృతికి ఆయన కుమారుడే కారణమని ఆయన మేనల్లుడు సాయి అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

మృతి చెందిన తర్వాత కోడెలను బసవతారకం ఆస్పత్రికి తరలించడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ కప్పిపుచ్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. కోడెల అవినీతి వ్యవహారాలు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలపై మాట్లాడలేక చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. 

సంబంధిత వార్తలు...
మాజీ స్పీకర్కోడెల ఆత్మహత్య

ఆది నుంచి వివాదాలే!

కోడెల మృతిని రాజకీయం చేయవద్దు

కొడుకే వేధించాడు: కోడెల బంధువు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top