
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని, కేసీఆర్‌కు ఎప్పటికీ విధేయత కలిగివుంటానని అన్నారు. చిన్నప్పటి నుంచి పేదల కోసం కష్టపడి పనిచేసినట్టు వెల్లడించారు. తనకు మంత్రి పదవి దక్కడమే ఎక్కువని, ఏ శాఖ అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపతానని, బంగారు తెలంగాణ సాధనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.
అదృష్టంగా భావిస్తున్నా: నిరంజన్ రెడ్డి
కేసీఆర్‌తో పనిచేయడం తన అదృష్టమని ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి అన్నారు. తొలిసారి గెలిచినా తనను మంత్రిని చేశారని సంతోషం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ తనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఆ అనుభవం మంత్రిగా పనిచేయడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. (నేడే కేసీఆర్ కేబినెట్ విస్తరణ)
కేసీఆర్‌కు స్పష్టత ఉంది: జగదీశ్‌రెడ్డి
రెండోసారి మంత్రి కావడం ఆనందంగా ఉందని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఏ బాధ్యత ఇచ్చిన సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. ప్రజలకు, పార్టీకి విధేయుడిగా పనిచేస్తానన్నారు. నల్గొండలో టిఆర్ఎస్ జెండా ఎగరడం లో తమ వంతు కృషి చేశానని, ఈ అంశం కూడా మంత్రి పదవి రావడానికి దోహదపడిందన్నారు. గతంలో తాను నిర్వహించిన విద్యుత్ శాఖ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు వెల్లడించారు. అనేక సమీకరణాలతో మంత్రి వర్గాన్ని విస్తరించారని, ఎవరి సేవలను ఎక్కడ ఉపయోగించుకుకోవాలనే దానిపై సీఎం కేసీఆర్‌కు స్పష్టత ఉందన్నారు.