
సాక్షి, హైదరాబాద్: గడువు పూర్తయ్యేదాకా ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఓడిపోతామనే భయం, అభద్రతా భావంతోనే అసెంబ్లీని రద్దు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గురువారం మగ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జమిలీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పిన కేసీఆర్, ఇప్పుడెందుకు మాటమార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ రద్దు అప్రజాస్వామికమని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేశానంటూ కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇంకా పూర్తి కాలేదని, మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ ఇప్పుడెలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.