రాష్ట్రంలో వ్యవస్థలు నాశనం

Botsa takes on Chandrababu Naidu - Sakshi

 వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

 ఓట్ల తొలగింపు దుర్మార్గపు చర్య

సాక్షిప్రతినిధి, విజయనగరం: సీఎం చంద్రబాబునాయుడు హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు సర్వ నాశనమయ్యాయని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విజయనగరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో ఏ ఒక్క వ్యవస్థనూ చట్టప్రకారం నడవనివ్వలేదని మండిపడ్డారు. కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు రాష్ట్రాన్ని దోచుకుతినేలానే ప్రభుత్వ పథకాలు రూపొందిస్తున్నారని, డీపీఆర్, ఆర్థిక శాఖ అనుమతులు, ఏజెన్సీలను ఫిక్స్‌ చేయకుండానే శంకుస్థాపనలు చేయడం దానిలో భాగమేనన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న చోట్ల  పోలీస్, రెవెన్యూ వ్యవస్థల వత్తాసుతో సర్వేల పేరిట ఇంటింటికీ తిరిగి, ఆధార్‌ కార్డులు, ఫోన్‌ నంబర్లు తీసుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేసేందుకు కుట్ర సాగుతోందని విమర్శించారు.

డీఐజీ వ్యాఖ్యలు సరికాదు

ఎవరైనా, ఎలాగైనా సర్వేలు జరుపుకోవచ్చని డీఐజీ చేసిన ప్రకటనను బొత్స ఖండించారు. చట్టం అందరికీ సమానమని, కొందరికి చుట్టంగా మారకూడదని పేర్కొన్నారు. అదే ప్రకటనలో సర్వేల పేరుతో వేధించేవారిని, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నవారిని చట్టప్రకారం శిక్షిస్తామని డీజీపీ, డీఐజీ చెప్పి ఉండాల్సిందని.. అలా కాకుండా ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్టును జిల్లాకు చెందిన మంత్రి, ఉత్తరాంధ్ర డీఐజీ చదవడం సరైన విధానం కాదన్నారు.  

మరో మోసానికి తెర..

రిజర్వేషన్ల పేరిట బీసీలను, కాపులను మరోసారి చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. నిజానికి 15 నెలల క్రితమే బీసీల సంక్షేమం కోసం ఏం చేయాలనే దానిపై తమ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలోనే జగన్‌  బీసీ డిక్లరేషన్‌ను చాలాసార్లు ప్రకటించారని, దానిని కాపీ కొట్టి చంద్రబాబు ఇప్పుడు బీసీ సదస్సు పెట్టారని విమర్శించారు. చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందనీ, అందుకే డ్వాక్రా మహిళలకు పోస్ట్‌డేటెట్‌ చెక్కుల పంపిణీతో ఎర వేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఓట్ల గల్లంతు కుట్రలపై మరోసారి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి తామే కనిపెట్టినట్లు ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయరని చెప్పారు. రూ.1000 పింఛన్‌ను రూ.2వేలు చేస్తామని, అవసరమైతే రూ.3వేలు చేస్తామని జగన్‌ ముందే ప్రకటిస్తే.. దానిని బాబు కాపీ కొట్టారని, అది వైసీపీ విజయమేనని అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top