‘మా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలవదు’

BJP Will Win All MP Seats In 2019 Loksabha Elections, Says Vijay Rupani - Sakshi

అహ్మదాబాద్‌: ‘వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేద’ని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే గుజరాత్‌లో పునరావృత మవుతాయని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో (26 ఎంపీ స్థానాలు)  బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పటీదార్‌, దళితుల నిరసనల వంటి ఇబ్బందులు ఉన్నా, ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టారని గుర్తుచేశారు. వస్తు సేవల పన్ను అమల్లోకి తేవడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీ జీఎస్టీని ‘గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌’ అంటూ ఎద్దేవా చేసినప్పటికీ వ్యాపారులు బీజేపీపై నమ్మకముంచారని రూపానీ అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని వర్తక, వ్యాపార వర్గం తమ పార్టీకి మద్దతు ప్రకటించిందని తెలిపారు. వారి మద్దతుతో గత అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్‌, వడోదర, అహ్మదాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుపొందామని వెల్లడించారు.

ఆదివారం నాడు రాజ్‌కోట్‌లో దళితుడని కొట్టి చంపిన ఘటనపై రూపానీ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులను అరెస్టు చేశామని అన్నారు. మృతుని కుటుంబానికి 8 లక్షల రూపాయలు నష్ట పరిహారం అందించామని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top