ఘనంగా బీజేపీ విజయోత్సవం | With BJP surging in Telangana Says k Laxman | Sakshi
Sakshi News home page

ఘనంగా బీజేపీ విజయోత్సవం

May 25 2019 1:25 AM | Updated on May 25 2019 1:25 AM

With BJP surging in Telangana Says k Laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ దాటితే టీఆర్‌ఎస్‌ చెల్లని రూపాయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలను గెలుపొందటంతో శుక్రవారం నాంపల్లి లోని రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అనంతరం   గన్‌ పార్క్‌ వరకు విజయోత్సవర్యాలీ నిర్వహించారు. అక్కడి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.  సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సభకు తాజాగా ఎంపీలుగా గెలుపొందిన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావుతోపాటు పార్టీ ముఖ్యనేతలు, డీకే అరుణ, పొంగులేటి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలుగా గెలిచిన వారిని పార్టీ నేతలు వారిని సన్మానించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడారు.  

కార్యకర్తల కళ్లలో వెలుగులు..
ఈ విజయంతో బీజేపీ కార్యకర్తల కళ్లలో వెలుగులు కనిపిస్తున్నాయని లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలోని కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మోదీ హఠావో అన్న విపక్షాలను ప్రజలు తిరస్కరించారని, కన్హయ్య కుమార్‌ను దేశ ప్రజలు మూడోస్థానానికి నెట్టివేశారని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం నేర్పారన్నారు. ఈ ఫలితాలతో కేటీఆర్‌కు మాటలు రావడం లేదన్నారు. కవితను రైతులు సాగనం పారని పేర్కొన్నారు. తామేం బొందుగాళ్లం కాదని, హిందువులమని ప్రజలు తేల్చారని అన్నా రు.

ఈ ఫలితాలతో తన జీవితం ధన్యమైందని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా గర్వపడుతున్నానని తెలిపారు. హైదరాబాద్‌ బీజేపీకి అడ్డా అని తేలిందని, సిరిసిల్లలో కూడా టీఆర్‌ఎస్‌ పీఠాలు కదిలిపోతున్నాయని చెప్పారు. కేటీఆర్‌ కళ్లు తెరిచి చూస్తే బీజేపీ ఎక్కడుందో కనిపిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ చరిత్ర సృష్టించిందని అమిత్‌ షా అభినందించారని వివరించారు. మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణలో 4 సీట్లు గెలవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రధాని స్థానానికి మోదీ తప్ప ఎవరు పనికిరారని ప్రజలు తేల్చారని, ఇది ప్రజల విజయమన్నారు.  

దేశంలోని ప్రతి జిల్లాలో బీజేపీ జెండా: మురళీధర్‌రావు
దేశంలోని ప్రతి జిల్లాలో బీజేపీ జెండా ఎగిరిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. జీఎస్టీ అమలు పర్చిన ప్రపంచ నాయకుల్లో గెలిచింది కేవలం మోదీనేనని కొనియాడారు. రాజకీయ విశ్లేషకులందరూ బీజేపీపై మానసిక ఒత్తిడి పెట్టారన్నారు. మోదీ ముందు కేసీఆర్‌ పనికిరారని తెలంగాణ ప్రజలు తేల్చారని పేర్కొన్నారు. మోదీని, బీజేపీని విమర్శిస్తే బాగుండదనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మమతను చూసి కేసీఆర్‌ గుణపాఠం నేర్చుకోవాలన్నారు. దేశంలో కాంగ్రెస్‌ లేదన్నారు. బీజేపీకి తెలంగాణ పొటెన్షియల్‌ స్టేట్‌ అని పేర్కొన్నారు.  

తెలంగాణలో హిందువులకే స్థానం: బండి
తెలంగాణ బీజేపీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్‌ఎస్‌ అహంకారం గురించే మాట్లాడుతున్నారన్నారు. ప్రజలకు కేంద్ర పథకాలు తప్ప రాష్ట్ర పథకాలు ఒక్కటి కూడా అందడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి సెంటిమెంట్‌ అయిన కరీంనగర్‌లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని తెలిపారు. తెలంగాణలో హిందువులకు తప్ప బొందుగాళ్లకు స్థానం లేదని ప్రజలు తేల్చారన్నారు.  

ఇది ప్రజల విజయం: సోయం బాపూరావు
లోక్‌సభ ఎన్నికల్లో తమ గెలుపు ప్రజల విజయమని ఆదిలాబాద్‌ నుంచి గెలుపొందిన సోయం బాపూరావు అన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.  

టీఆర్‌ఎస్‌ అహంకారాన్నిప్రజలు వ్యతిరేకించారు: కిషన్‌రెడ్డి
సికింద్రాబాద్‌ ఎంపీగా గెలుపొందిన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమైన స్థానాల్లో బీజేపీ గెలిచిందన్నారు. టీఆర్‌ఎస్‌ అహంకార వైఖరిని ప్రజలు వ్యతిరేకించారని వెల్లడించారు. అక్రమ కేసుల ద్వారా ప్రజాసంఘాల నాయకులను కేసీఆర్‌ బయపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ మజ్లిస్‌ పార్టీని నమ్ముకుందని పేర్కొన్నారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement