సీన్‌ రిపీట్‌?

BJP Party Profile And History in Lok Sabha Election - Sakshi

8 రాష్ట్రాలు.. 216 సీట్లు

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్‌ ఇదీ..

ప్రస్తుతం మళ్లీ ప్రభంజనం సృష్టించేనా?..

ఆ 8 రాష్ట్రాల్లో గెలుపునకు వ్యూహమేమిటి?..

గెలిచే సీట్లపై ‘కమలం’ శిబిరంలోనే సందేహాలు...

బీజేపీకి గత ఎన్నికల్లో పట్టంగట్టిన ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడు పరిస్థితి ఏమిటి? నూటికి నూరు శాతం సీట్లు గెలుచుకున్న రాజస్తాన్, గుజరాత్‌లో ఫలితాలు పునరావృతం అవుతాయా? మళ్లీ అధికారంలోకి రావాలంటే కాషాయ కూటమికి లోటును భర్తీ చేసే రాష్ట్రాలు ఏమిటి? మేజిక్‌ ఫిగర్‌ 272 చేరడానికి బీజేపీ అనుసరించే వ్యూహం ఏమిటి?

కిందటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 75 శాతం సీట్లు 8 రాష్ట్రాల్లోనే లభించాయి. దేశ ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్తాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్‌లోని 273 సీట్లలో కాషాయ పక్షానికి 216 సీట్లు దక్కాయి. ఈ రాష్ట్రాల్లోని సీట్లలో 80 శాతం బీజేపీ కైవసం చేసుకున్న కారణంగా లోక్‌సభలో మెజారిటీ వచ్చింది. అంటే పాలకపక్షం గెలుచుకున్న 282 సీట్లలో నాలుగింట మూడొంతుల సీట్లు ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచే వచ్చాయి. సాధించిన సీట్లలో అత్యధిక శాతం ఇక్కడే లభించడం వల్లే దేశవ్యాప్తంగా 31 శాతం ఓట్లతోనే బీజేపీ మెజారిటీ సీట్లు సంపాదించగలిగింది. ఈ ప్రాంతాల్లో ఇదే స్థాయిలో విజయం సాధించడం లేదా అంతకన్నా ఎక్కువ సీట్లు సాధించడం 2019 ఎన్నికల్లో బీజేపీకి కుదిరే పని కాదని రాజకీయ పండితుల అంచనా. ప్రజల్లో పాలకపక్షంపై పెరిగిన వ్యతిరేకత, విపక్షాల మధ్య అవగాహన వంటి అనేక అంశాల కారణంగా పై రాష్ట్రాల్లో మళ్లీ 80 శాతం సీట్లు గెలుస్తామన్న ధీమా బీజేపీకి సైతం లేదు. తమకు మొదట్నించీ బలం లేని ఇతర రాష్ట్రాల్లో అదనంగా సీట్లు కైవసం చేసుకుని ఈ 8 రాష్ట్రాల్లో వచ్చే లోటును భర్తీ చేసుకోవడానికి బీజేపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. అవెంత వరకు ఫలిస్తాయో అంచనా వేయడం కష్టం. 2014లో మాదిరిగా బీజేపీకి ఇన్ని సీట్లు రాకపోవచ్చనే అభిప్రాయానికి చాలా కారణాలున్నాయి.

యూపీ: నల్లేరుపై నడక కాదు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 సీట్లలో 71 గెలుచుకుంది. ‘మోదీ ప్రభంజనం’ ఉత్తరాదిని ఊపేస్తున్న సమయంలో సాధించిన ఈ గెలుపు ఈ వేసవిలో అంత తేలిక కాదు. 2014 ఎన్నికల్లో గెలిచిన సీట్లలో నాలుగో వంతు యూపీ నుంచే బీజేపీకి దక్కాయి. యూపీలో బీజేపీయేతర ప్రధాన పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్‌ తదితర పార్టీల మధ్య అప్పుడెలాంటి పొత్తు లేదు. అప్నాదళ్‌ అనే చిన్న పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ఆ ఘన విజయం సాధించింది. అయితే, ఈసారి బీఎస్పీ, ఎస్పీ కలిపి పోటీ చేస్తున్నాయి. బీసీలు, దళితుల్లో గట్టి పునాదులున్న బీఎస్పీ, ఎస్పీ పశ్చిమ యూపీలో జాట్‌ సామాజికవర్గంపై ఆధారపడిన ఆరెల్డీతో చేతులు కలపడంతో బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లు దాటితే ఘన విజయంగా భావించవచ్చు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెల్లెలు ప్రియాంకకు తూర్పు యూపీ ప్రచార బాధ్యతలు అప్పగించడం, పశ్చిమ యూపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా జ్యోతిరాదిత్య సింధియా పనిచేస్తుండడంతో బీజేపీ పని నల్లేరుపై నడక కాదు. రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో రాష్ట్రంలో యోగీ ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో అధికారంలోకి వచ్చినా.. బీజేపీ సర్కారు పనితీరు గొప్పగా లేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జరిగిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ప్రభావం ఉంటే తప్ప బీజేపీకి యూపీలో 60 సీట్ల వరకూ వచ్చే అవకాశాల్లేవు.

మూడు రాష్ట్రాల్లో పోటాపోటీ
కిందటేడాది చివర్లో జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో ఘోర పరాజయం పాలైంది. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో వరుసగా 25, 27 సీట్లు కైవసం చేసుకోగా అసెంబ్లీ పోరులో పోలైన ఓట్లలో సగం సాధించింది కానీ, మెజారిటీ సీట్లలో ఓడిపోయింది. జరిగేవి జాతీయ ఎన్నికలు కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో మోదీ కరిజ్మా, పాక్‌పై వైమానిక దాడుల ప్రభావం ఒకవేళ పనిచేసినా ఇక్కడ 80 శాతం లోక్‌సభ సీట్లు గెలవడం కష్టమే. ఛత్తీస్‌గఢ్‌లో పదిహేనేళ్ల బీజేపీ పాలన తర్వాత కాంగ్రెస్‌ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆరు నెలల్లోపు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి భిన్నఫలితం దక్కే అవకాశాలు తక్కువ.

బిహార్‌/జార్ఖండ్‌: 2014 ఎన్నికల్లో ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్పీతో పొత్తు పెట్టుకుని బిహార్‌లోని 40 సీట్లలో బీజేపీ 30 చోట్ల పోటీచేసి 22 సీట్లు గెలుచుకుంది. జేడీయూ తో పొత్తు లేకుండా ఇన్ని సీట్లు గెలవడం విశేషం. 2017 లో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వంలో బీజేపీ చేరడంతో మళ్లీ జేడీయూ, ఎల్జేపీతో చేతులు కలపడానికి అవకాశం వచ్చింది. కానీ ఈసారి బీజేపీ 17 సీట్లకే పోటీ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర సర్కార్లలో బీజేపీ భాగస్వామి కావడం వల్ల పాలకపక్షాలపై జనంలో వ్యతిరేకత ఉంటే దాని ప్రభావం బీజేపీపైనా పడుతుంది. అదీగాక, ఆర్జేడీ నాయకత్వంలోని ప్రతిపక్షాల కూటమి బలంగా ఉండడంతో ఎన్డీయే గట్టి పోటీయే ఎదుర్కొంటోంది. 14 సీట్లున్న పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌లో బీజేపీ కిందటిసారి 40 శాతం ఓట్లతో 12 సీట్లు కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పాలకపక్షంగా నాలుగున్నరేళ్లుగా బీజేపీ పనిచేస్తోంది. రఘువర్‌దాస్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కారు జనాదరణ పొందలేదు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీతో కూడిన ప్రతిపక్ష కూటమి గట్టి పోటీనిస్తోంది. ఇక్కడ కూడా ఏడెనిమిది సీట్లు బీజేపీకి వస్తే గొప్ప విజయం కింద లెక్కే.

గుజరాత్‌: మోదీ మేజిక్‌ ఎంత?
మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా బీజేపీ ప్రధాని అభ్యర్థిగా జరిగిన 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ 25 సీట్లను సునాయాసంగా గెలుచుకుంది. మోదీ స్వయంగా వడోదరా నుంచి పోటీ చేయడంతో మోదీ ప్రభంజనం సునామీ సృష్టించింది. కాని, ఆయన తర్వాత ఇద్దరు సీఎంలు మారడం, పాటీదార్ల కోటా ఆందోళన, గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తి కారణంగా 2017 డిసెంబర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా అసెంబ్లీలో బలం 115 నుంచి 99కి పడిపోయింది. మోదీ రెండోసారి ప్రధాని అవుతారనే కారణంతో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా గత ఫలితాలు పునరావృతం కావడం కష్టం.
ఆరు రాష్ట్రాల్లో 91 శాతం విజయాలు!

యూపీ, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ వరకే చూస్తే కిందటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఆరింటిలో బీజేపీ తాను పోటీచేసిన సీట్లలో 91 శాతం కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. మోదీ గాలితో పాటు, పదేళ్ల యూపీఏ పాలనపై జనాగ్రహం, అవినీతి నిర్మూలనకు బీజేపీ ఇచ్చిన హామీలు పనిచేయడంతో ఈ 8 రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో సీట్లు కాషాయపక్షానికి చిక్కాయి. ఈశాన్య ప్రాంతంలోని 25 సీట్లలో 15 వరకూ బీజేపీ గెలిస్తేనే ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో తగ్గిన సీట్ల భర్తీకి వీలవుతుంది. 2014లో బీజేపీకి ఈశాన్యంలో 9 సీట్లు వచ్చాయి. వరుసగా రెండు, ఒకటి సీట్లే దక్కిన పశ్చిమ బెంగాల్, ఒడిశాలో బీజేపీ సాధించే సీట్ల సంఖ్య 20కి పెరుగుతుం దని ఆ పార్టీ అంచనా. తమిళనాడులో గతం లో ఒక సీటే బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఐదు సీట్లకు పోటీచేస్తోంది.

మహారాష్ట్ర: పాత కూటమే పోటీ
మహారాష్ట్రలో ఇప్పటిలాగానే శివసేనతో జతకట్టిన బీజేపీ కిందటిసారి 48 సీట్లలో 23 సీట్లు గెలుచుకుంది. గతంలో కాషాయ కూటమిలో భాగమైన స్వాభిమానీ షేట్కారీ సంఘటన ఈసారి ప్రతిపక్షాలతో చేతులు కలపడానికి  సిద్ధమౌతోంది. నాలుగేళ్లకు పైగా బీజేపీ–శివసేన సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంది. కాషాయపక్షానికి 15 సీట్లు వస్తే గొప్పే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top