జగన్‌పై హత్యాయత్నం కుట్రలో బాబు పాత్ర

BJP leaders fires on Chandrababu About Murder Attempt on YS Jagan Case - Sakshi

అందుకే ఎన్‌ఐఏ విచారణ అంటేనే ఆయనకు చెమటలు పడుతున్నాయ్‌ 

కుట్ర బయటపడుతుందనే కదా..

చంద్రబాబు వ్యవహారశైలిపై బీజేపీ నేతల ధ్వజం 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కుట్రలో సీఎం చంద్రబాబు పాత్ర ఉంది కాబట్టే.. ఎన్‌ఐఏ విచారణతో నిజాలు బయటపడతాయని ఆయనకు చెమటలు పడుతున్నాయని రాష్ట్ర బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ఘటన విశాఖ విమానాశ్రయంలో జరిగింది కాబట్టి.. అది కేంద్రం పరిధిలోదని చెప్పి కేసు విచారణతో తమకు సంబంధం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు కేసును ఎన్‌ఐఏ విచారిస్తుంటే ఎందుకు అంతలా ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కో ఇన్‌చార్జ్‌ సునిల్‌ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆదివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్‌పై దాడి కేసును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు వ్యవహారశైలిపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్య కేసును ఎన్‌ఐఏకు అప్పగించినప్పుడు ఎన్‌ఐఏపై విశ్వాసం వ్యక్తం చేసిన బాబు.. జగన్‌ కేసు విచారణకొచ్చే సరికి రాష్ట్ర సంబంధాల్లో కేంద్రం జోక్యం ఎందుకు? అని అంటున్నారని ధ్వజమెత్తారు.

మానసిక వ్యాధితో బాధపడుతున్న బాబు : కన్నా
ఒకే విషయంపై రోజుకోరకంగా మాట్లాడుతున్న చంద్రబాబు పరిస్థితి చూస్తే ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అర్థమవుతోంది. జగన్‌పై దాడి కేసుతో తమకు సంబంధం లేదని ఘటన జరిగిన రోజు మీడియా ముందు చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగిస్తే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మానసిక వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు సీఎంగా ఉండడం ప్రమాదకరం. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో 600 హామీలు ఇచ్చి అన్ని వర్గాలను మోసం చేశారు.

బీజేపీకి చంద్రబాబే బ్రాండ్‌ అంబాసిడర్‌: సునిల్‌ దియోధర్‌
‘కేంద్రం ఏపీకి ఏం చేయలేదంటూనే ఇప్పటి వరకు చేసిన మేలుపై పరోక్షంగా ప్రచారం కల్పిస్తున్న చంద్రబాబే ఏపీ బీజేపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌. కేంద్రం ఇచ్చిన నిధులను జన్మభూమి కమిటీలోని దొంగలు దోచుకుంటూ.. గజదొంగైన చంద్రబాబుకు దోచిపెడుతున్నారు. అమిత్‌షా ఈ నెల 18 కడప, ఫిబ్రవరి ఒకటిన వైజాగ్‌లలో పర్యటించి పార్టీశ్రేణులతో సమావేశమవుతారు. 

అప్పుడు మంచివి.. ఇప్పుడు చెడ్డవా?  : జీవీఎల్‌
తన ప్రత్యర్థులపై ఎన్‌ఐఏ, సీబీఐలు కేసులు నమోదు చేస్తే దర్యాప్తు సంస్థలన్నీ బాగా పనిచేసినట్టు.. తన మనుషులపై కేసులు పెడితే మాత్రం బాబు సహించరు. ఏకంగా సీబీఐనే రాష్ట్రంలో నిషేధించారంటే చంద్రబాబు ఏ స్థాయిలో తప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top