కేసీఆర్‌వి ఒట్టిమాటలే

BJP Leader Laxman Slams CM KCR - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

సైదాబాద్‌: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని చెప్పిన కేటీఆర్‌ విషాద నగరంగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. మూసీ నదిని కొబ్బరి నీళ్లతో నింపుతామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు నేటికీ నెరవేరలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ను నమ్ముకుంటే ప్రజలకు మేలు జరగదని పేర్కొన్నారు. మలక్‌పేట నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ నాయకులు కొత్తకాపు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సుమారు వంద మంది కార్యకర్తలు లక్ష్మణ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సైదాబాద్‌ రెడ్డిబస్తీ నుంచి సరూర్‌నగర్‌ చెరువు వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్‌బీహెచ్‌ ఏ కాలనీలోని కమ్యూనిటీహాలులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పార్టీలో చేరిన వారికి లక్ష్మణ్‌ కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మలక్‌పేటలో బీజేపీకి పూర్వ వైభవం తీసుకరావాలని కార్యకర్తలను కోరారు. నల్లు ఇంద్రసేనారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మలక్‌పేట బీజేపీకి కంచుకోటగా ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు. తెలంగాణలో కల్వకుంట్ల పాలన కొనసాగుతుందని, దీనికి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడాలన్నారు. కేసీఆర్‌ చేస్తున్న అవినీతిని బీజేపీ వెలికితీస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్‌లో చాల మంది నాయకులు అవమానభారంతో పని చేస్తున్నారని, వారందరిని బీజేపీ ఆహ్వానిస్తుందని తెలిపారు.

అప్పుల రాష్ట్రంగా మార్చేశారు: డీకే అరుణ
తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మార్చారని బీజేపీ రాష్ట్ర నాయకురాలు, మాజీ మంత్రి డీకె అరుణ అన్నారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్‌ వాళ్ల ఇంట్లో మాత్రం అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని చెప్పారు. నగరంలో వర్షం వస్తే మోకాళ్ల లోతు నీళ్లు రోడ్లపై  చేరి ట్రాఫిక్‌ నిలిచిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ బీజేపీలో పని చేసుకుంటుపోతుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని అన్నారు. బీజేపీ కుటంబ పార్టీ కాదని, సిద్ధాంతాల పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, సుభాష్‌చందర్‌జీ, జితేందర్‌రెడ్డి, మలక్‌పేట కన్వీనర్‌ సమ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి,  రామ్‌రెడ్డి, సంగోది పరమేష్‌కుమార్,  ప్రకాశ్, రంగారెడ్డి, గౌతంరావు, రామారావు, గోవర్థన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top