
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అవినీతికి సంబంధించి రేవంత్‌రెడ్డి ఇచ్చే ఆధారాలను స్వీకరిస్తామని ఆయన వెల్లడించారు. టీఆర్‌ఎస్‌లో ఓనర్లు, కిరాయిదారుల పంచాయితీ నడుస్తుండగా.. కాంగ్రెస్‌లో పాత కాంగ్రెస్-కొత్త కాంగ్రెస్ పంచాయితీ నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఎన్నికల నోటికేషన్ వెలువడ్డాక అభ్యర్థిని ప్రకటిస్తామని లక్ష్మణ్ తెలిపారు.
చదవండి: ఆధారాలను లక్ష్మణ్‌కు అందజేస్తా: రేవంత్‌రెడ్డి
అప్పుల ఊబిలో సింగరేణి
సింగరేణి కార్మికులు ఆశించింది 30 శాతం బోనస్ కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 28 శాతం బోనస్ ఇచ్చి సరిపెట్టిందని లక్ష్మణ్ తప్పుబట్టారు. ప్రభుత్వం చేసిన అప్పులతో సింగరేణి సంస్థకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. పిల్ల పుట్టకముందే కుల్లా కుట్టినట్టు.. తుపాకీ రాముడిలా సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటాయని ఎద్దేవా చేశారు. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలే కాదు మొత్తం రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల్లో నెట్టిందని ధ్వజమెత్తారు.
సింగరేణిని అప్పుల ఊబిలో నెట్టారని, ప్రభుత్వమే సింగరేణిని ముంచెసిందని ఆరోపించారు. సింగరేణిలో కార్మికులకు జీతాలు సకాలంలో చెల్లించలేక, బోనస్‌లు ఇవ్వలేక అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచి కార్మికుల శ్రమను సింగరేణి సంస్థ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. సింగరేణి ద్వారా బొగ్గు తీసుకొని కొన్ని సంస్థలు లాభాలను ఆర్జిస్తున్నాయని, కానీ, సింగరేణికి కట్టాల్సిన బకాయిలను అవి చెల్లించడం లేదన్నారు. ఆదాయ వనరుగా ఉన్న సింగరేణిని కేసీఆర్ కొల్లగొట్టారని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలోనూ తప్పడం లేదు
సింగరేణి సంస్థ ఆస్పత్రిలో డాక్టర్లు కూడా అందుబాటులో లేరని, కార్మికులు రోగాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానిదేనని చెప్పారు. సింగరేణి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేల నోళ్లు మూతపడ్డాయని మండిపడ్డారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగులు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణికి ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు బకాయి పడిందని, బోనస్ డబ్బులు చెల్లించాలని అన్నా... ఇప్పుడు ప్రభుత్వం అప్పులు చేయాల్సిందేనని అన్నారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలోనూ దుబాయి, ముంబయి, బొగ్గు బాయి బతుకులు తెలంగాణ ప్రజలకు తప్పడం లేదని పేర్కొన్నారు.