రోహింగ్యాలకు పింఛన్లా?

BJP Leader Laxman Comments On KCR And KTR - Sakshi

కేసీఆర్, కేటీఆర్‌ స్పందించాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: దొంగపత్రాలతో భారత గుర్తింపు కార్డులు తీసుకుని, ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న రోహింగ్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తోన్న వేలాదిమంది రోహింగ్యాలు గుర్తింపు కార్డులతోపాటు, పాస్‌పోర్టు వంటి అత్యున్నత ధ్రువీకరణలు పొందుతున్న విషయంపై సోమవారం లక్ష్మణ్‌ ఆధ్వర్యంలోని బీజేపీ నాయకుల బృందం డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలలో చాలామంది ఐఎస్‌ఐ, అల్‌కాయిదా సానుభూతిపరులు ఉన్నారని ఆరోపించారు.

వీరి వల్ల దేశభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని, వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రోహింగ్యాలు ధ్రువపత్రాలు తీసుకుంటూ పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు పొందుతున్నారని ఆరోపించారు. 189 మంది రోహింగ్యాలు ఆధార్, ఓటర్‌ కార్డు, పాసుపోర్టు వంటి ధ్రువీకరణలు సంపాదిస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీరికి ఆధార్‌ నుంచి నోటీసులు వస్తుంటే ఎంఐఎం అధినేత, ఎంపీ ఒవైసీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.

విదేశీయులకు మజ్లిస్‌ పార్టీ మద్దతివ్వడం, ఈ మొత్తం వ్యవహారంపై అధికార పార్టీ చూసీచూడనట్లు వ్యవహరించడంపై మండిపడ్డారు. పాముకు పాలుపోసి పెంచుతున్న ఇలాంటి నాయకులకు టీఆర్‌ఎస్‌ మద్దతిస్తోందన్నారు. రోహింగ్యాలు నగరంలో భూములు కబ్జాచేసి, శాశ్వత కట్టడాలు కడుతుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విమర్శించారు. మార్చి 15వ తేదీన సీఏఏకు అనుకూలంగా నగరంలో తలపెట్టిన అమిత్‌షా సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top