కూకటివేళ్లతో పెకలిస్తాం

BJP on Amit Shah's West Bengal rally - Sakshi

తృణమూల్‌ చీఫ్‌ మమతకు అమిత్‌ షా హెచ్చరిక

కోల్‌కతా నడిబొడ్డున బీజేపీ భారీ ర్యాలీ  

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో దుర్గాదేవి నిమజ్జనానికి, పాఠశాలల్లో సరస్వతి పూజకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మమతా బెనర్జీపై బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా మండిపడ్డారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు చేస్తే.. మమత అధికారాన్ని రోజుకో మెట్టు తగ్గిస్తామని హెచ్చరించారు. కోల్‌కతాలో శనివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన ర్యాలీలో షా పాల్గొన్నారు. తృణమూల్‌ను కూకటి వేళ్లతో పెకలించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘దుర్గాపూజ తర్వాత విగ్రహాల నిమజ్జనానికి అనుమతివ్వరు. బెంగాల్‌లోని చాలా పాఠశాలల్లో సరస్వతి పూజ జరుపుకోకుండా అడ్డుకున్నారు. ఇలాంటివి జరగాల్సిందేనా? బీజేపీ బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ఉత్సవాలన్నీ ఘనంగా జరుపుతాం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు’ అని పేర్కొన్నారు.  

చొరబాటుదారులకు స్వాగతమా?
మైనారిటీలను తృప్తిపరిచేందుకు, ఓటుబ్యాంకు రాజకీయాలు చేసేందుకు మమత సర్కారు ప్రయత్నిస్తోందని షా ఆరోపించారు. ‘రాష్ట్రంలోకి రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులకు స్వాగతం పలుకుతారు. దీని ద్వారా ప్రజలకు మీరేం చెప్పదలచుకున్నారు? మైనారిటీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పరిమితి ఉంటుంది’ అని షా విమర్శించారు. ర్యాలీలో తన  ప్రసంగం ప్రత్యక్షప్రసారం కాకుండా టీవీ చానళ్లకు మమత హెచ్చరికలు జారీచేశారన్నారు. ‘మా పార్టీ కార్యకర్తలపై నాకు అచంచల విశ్వాసముంది. వారు ప్రతి గల్లీ, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికీ వెళ్లి తృణమూల్‌ ఏం చేస్తోందో ప్రజలకు వివరిస్తారు’ అని స్పష్టం చేశారు.

ఎన్నార్సీపై నోరు మెదపరే?
అస్సాం జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ)పై తమ విధానమేంటో మమత, రాహుల్‌లు సమాధానం ఇవ్వాలన్నారు. వీరిద్దరూ దేశం కోసం ఆలోచిస్తున్నారా? లేక ఓటుబ్యాంకు కోసమేనా అని ప్రశ్నించారు. ‘రాహుల్‌ గాంధీ ఎన్నార్సీపై తన అభిప్రాయాన్ని ఎందుకు వెల్లడించడం లేదు. ఆయనకు దేశభద్రత కన్నా ఓటు బ్యాంకే ముఖ్యమా?’ అని విమర్శించారు. అయితే, షా ర్యాలీ ఫ్లాప్‌ షో అని తృణమూల్‌ పేర్కొంది.

ఎన్నార్సీ అమలు తీరుపైనే వ్యతిరేకం: కాంగ్రెస్‌
కోల్‌కతా: జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ)కి తాము వ్యతిరేకం కాదని, అస్సాంలో అది అమలైన తీరును మాత్రమే తప్పు పడుతున్నామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఎన్నార్సీపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా, పశ్చిమబెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఈ సర్వే గందరగోళంగా జరిగిందనటానికి మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ కుటుంబ సభ్యులతోపాటు ప్రముఖుల పేర్లు జాబితాలో గల్లంతు కావడమే ఉదాహరణ’ అని అన్నారు. ‘మేం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం లేదు. ఎన్సార్సీని అమలు చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని మోదీ ప్రభుత్వమే 2017లో సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం  చెప్పేదొకటి, చేసేదొకటి’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top