అధికారం కోసం అర్రులు చాచే పార్టీ కాదు మాది!

Bhatti Vikramarka Comment on Telangana Elections - Sakshi

సర్పంచ్‌, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుదాం!

కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు గౌరవిస్తానని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అయితే, ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతల మాటలు, వారి అహంకారపూరిత తీరు ఖండిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్), పోడెం వీరయ్య (భద్రాచలం)లతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో 
గెలుపోటములు సాధారణమైనవని, గెలుపు శాశ్వతం అనుకుంటే.. అది అధికార పార్టీ నేతల మూర్ఖత్వమే అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ కేవలం అధికారం కోసం అర్రులు చాచే పార్టీ కాదన్నారు. 
అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన శాసనసభలో, బయట నిలబడతాం పోరాడుతామని చెప్పారు. 

కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ‘పలు సందర్భాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందని, అప్పుడు కాంగ్రెస్ పనైపోయింది.. ఇక మళ్లీ అధికారంలోకి రాదన్నారు. దివిసీమ ఉప్పెనప్పుడు 1977లో ఇందిరాగాంధీని ఇక్కడకి వస్తే అల్లర్లు అవుతాయని అప్పటి సీఎం ఆపారు. కానీ సంవత్సరంలోపే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలతో కార్యకర్తలు నిరుత్సాహం చెందొద్దు. రానున్న సర్పంచ్, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం’ అని హితబోధ చేశారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మాట నిలబెట్టుకోవాలని సూచించారు. పార్టీ విధానాల ప్రకారం సీఎల్పీ నేత ఎన్నిక జరుగుతుందన్నారు. ప్రజాకూటమి కొనసాగింపుపై త్వరలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎందుకు అంత ఎక్కువ మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచింది విశ్లేషించుకుంటామన్నారు.

.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top