68 ప్రశ్నలతో టాప్‌!

Asaduddin Owaisi Record With 68 Questions In Parliament - Sakshi

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఎంపీ అసదుద్దీన్‌ రికార్డు 

మన ఎంపీల కన్నా ఎక్కువ ప్రశ్నలడిగిన ఒవైసీ 

ఐదు చర్చల్లో మాట్లాడిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా, రంజిత్, ప్రభాకర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం) బడ్జెట్‌ సమావేశాల్లో హైలెట్‌గా నిలిచారు. తన పార్టీ పక్షాన పలు చర్చల్లో పాల్గొన్న ఆయన ఏకంగా 68 ప్రశ్నలు అడిగి కేంద్రం నుంచి సమాధానాలు రాబట్టారు. రాష్ట్రానికి చెందిన ఎంపీల్లో ఆయనే అత్యధికంగా ప్రశ్నలు అడగ్గా, దేశంలోనే అతి తక్కువ మంది ఎంపీలు అసద్‌తో సమానంగా బడ్జెట్‌ సమావేశాలను వినియోగించుకున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరిగే తీరును వివరించే పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 94 శాతం మంది ఈ సారి బడ్జెట్‌పై చర్చల్లో పాల్గొని ప్రశ్నలు వేశారు.

ఈ వెబ్‌సైట్‌ వివరించిన ప్రకారం మొత్తం 6,197 ప్రశ్నలు ఈ బడ్జెట్‌ సమావేశాల్లో అడగ్గా.. కేంద్రం లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. ఇందులో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 9 ప్రశ్నలు ఉన్నాయి. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, మున్సిపాలిటీలకు నిధులు, ఎలక్ట్రానిక్‌ పార్కు, టూరిజం సర్క్యూట్, స్వదేశ్‌ దర్శన్‌లో తెలంగాణను చేర్చే అంశం, డ్యాంల భద్రత, ఆరోగ్య రంగం, కొత్త రైళ్ల ప్రతిపాదనలను మన ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

మన సమస్యలు కేంద్రం దృష్టికి 
వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ మినహా అందరూ చర్చల్లో భాగస్వాములయ్యారు. ఇందులో అసదుద్దీన్‌ ఒవైసీ అత్యధికంగా 68 ప్రశ్నలు వేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలు 11 ప్రశ్నలు వేసి 5 చర్చల్లో పాల్గొన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా 3 అంశాల్లో చర్చలో పాల్గొన్నారు. జీరో అవర్‌లో భాగంగా ఆయన కంటోన్మెంట్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావిస్తూ కంటోన్మెంట్‌ బోర్డు, అక్కడి ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా వ్యవసాయానికి బడ్జెట్‌ కేటాయింపులు, కేంద్రం రైతుకు ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీపై మాట్లాడారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ అధికారిణిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ పోడు వ్యవసాయం అంశాన్ని పరిష్కరించేలా రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించాలని కోరారు.

పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌లు రాష్ట్రానికి చెందిన సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓ అసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని రాష్ట్రాల మధ్య కాలమానంలో వ్యత్యాసం ఉందని, ఈ నేపథ్యంలో దేశంలో రెండు టైం జోన్లను ఏర్పాటు చేసే అవకాశంపై ప్రశ్నించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా మలేరియా నిర్మూలన, డ్రగ్స్‌ నియంత్రణ వ్యవస్థ, జాతీయ రహదారుల ప్రాజెక్టులు తదితర అంశాలపై మాట్లాడారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావులు కూడా బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top