పాక్‌ హిందువులపై ఎందుకంత ప్రేమ: కేజ్రీవాల్‌

Arvind Kejriwal Says No Need For CAA Focus On Unemployment - Sakshi

సీఏఏపై కేజ్రీవాల్‌ విమర్శలు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంటే ఏంటో తనకు అర్థంకావడం లేదని.. అసలు ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. సీఏఏ కంటే నిరుద్యోగిత, ఆర్థిక మందగమనంపై ఎక్కువగా దృష్టి సారించాలని కేంద్రానికి హితవు పలికారు. పొరుగు దేశ హిందువుల గురించి పట్టించుకోవడం మాని.. దేశంలోని సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టౌన్‌హాల్‌ సమావేశాల పేరిట కేజ్రీవాల్‌ ప్రజలతో సమావేశమవుతున్నారు. ఇప్పటివరకు తాను చేసిన హామీల అమలును వివరిస్తూనే, బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం నాటి ఎన్డీటీవీ టౌన్‌హాల్‌ సమావేశంలో కేజ్రీవాల్‌ సీఏఏ గురించి ప్రస్తావించారు. ‘అసలు ఇదంతా ఏంటి? పాకిస్తాన్‌ హిందువుల పైన ఇంత ప్రేమ ఎందుకు? ఇక్కడున్న హిందువుల పరిస్థితి ఏంటి? నాకసలు ఏమీ అర్థంకావడం లేదు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ఉద్యోగాలు లేవు. ఇప్పుడు సీఏఏ ఆవశ్యకత ఏమిటి? నేను బురారీలో ఓ వ్యక్తిని కలిశాను. అతడు బిహార్‌ లేదా ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇక్కడికి వచ్చాడనుకుంటా. తనకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఉందా అని నేను అడిగాను. తాను ఇంట్లోనే పుట్టానని, తనకు అలాంటి సర్టిఫికెట్‌ ఏదీ లేదని అతడు సమాధానమిచ్చాడు. వాళ్ల తల్లిదండ్రులకు కూడా సర్టిఫికెట్లు లేవన్నాడు. మరి అలాంటి వాళ్లు ఈ దేశంలో ఎలా బతుకుతారు. వాళ్లు ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సిందేనా అని ప్రశ్నించారు.(చదవండి: పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)

అదే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీరును సైతం కేజ్రీవాల్‌ తప్పుబట్టారు. ఎన్నార్సీ గురించి ఇప్పుడు మాట్లాడవద్దని అమిత్‌ షా అంటారు. ‘మరి ఆయన ఎప్పుడు ఈ విషయం గురించి స్పష్టతనిస్తారు? పేదలకు ఇళ్లు లేవు. యువతకు ఉద్యోగాలు లేవు. మీరు మాత్రం 2 కోట్ల మంది పాకిస్తానీ హిందువులను ఇక్కడకు తీసుకువచ్చే పథకాలు రచిస్తున్నారు. ముందు మీ దేశాన్ని సరిదిద్దుకోండి. ఆ తర్వాత వేరే వాళ్ల గురించి పట్టించుకోవచ్చు’ అంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాగా సీఏఏను రద్దు చేసే ప్రసక్తే లేదని అమిత్‌ షా ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక డిసెంబరు 31, 2014 తర్వాత ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లేదా పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా నరేంద్ర మోదీ సర్కారు సీఏఏ తీసుకువచ్చిన విషయం విదితమే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top