బాబు, లోకేష్‌లపై పొగడ్తల కోసమా?

AP BJP MLCs Satirical Comments On Motion Of Thanks On Governor Speech - Sakshi

శాసనమండలిలో టీడీపీ నేతల ప్రసంగాలపై బీజేపీ సభ్యుల మండిపాటు 

సాక్షి, అమరావతి: గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా అధికార టీడీపీ ఎమ్మెల్సీలు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను పొగుడుతూ ఉపన్యాసాలు చేయడంపై బీజేపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ‘గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అంటే చంద్రబాబు, లోకేష్‌బాబుల పొగడ్తల కోసం పెట్టుకున్న చర్చా..’ అంటూ విమర్శించారు. చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను పొగుడుతూ.. మోదీ, అమిత్‌షాలతోపాటు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ రాష్ట్రానికి ఎలా వస్తారంటూ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. 

డ్వాక్రా మహిళలను మోసం చేశారు..
లబ్ధిదారులకు పోస్టు డేటెడ్‌ చెక్కుల్ని పంపిణీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని.. దేశంలో మరే ప్రభుత్వం ఇలా చేయలేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ విమర్శించారు. గత ఎన్నికల్లో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశారని, ఇప్పుడు మహిళల బంగారం జప్తునకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయని తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 23 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7 వేల పోస్టుల భర్తీకే ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తప్పుపట్టారు.   కాగా, శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఓ ప్రశ్నకు మంత్రి దేవినేని ఉమా బదులిస్తూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ. 51 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ స్పందిస్తూ.. రాజధాని అమరావతి నిర్మాణం దగ్గర్నుంచి విజయవాడ, గుంటూరు నగరాలకు, నీటి ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులిస్తోందని, సభలో వాటి గురించి ప్రస్తావన
వచ్చినప్పుడు ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top