రాహుల్‌ ఓ మూర్ఖుడు: హెగ్డే

Anantkumar Hegde calls Rahul Gandhi a moron - Sakshi

సాక్షి, బెంగళూరు: రాహుల్‌ మూర్ఖుడు అంటూ కేంద్ర సహాయ మంత్రి, కర్ణాటకకు చెందిన అనంతకుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్య కొత్త వివాదం రేపింది. ‘మోదీలైస్‌’ (మోదీ అబద్ధాలు) అనే కొత్తపదం ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీల్లోకి వచ్చిందంటూ రాహుల్‌ గురువారం ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. ఇంగ్లిష్‌లోనే మోదీలైస్‌ అనే పదం లేకున్నా ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో ఉందంటూ రాహుల్‌ నకిలీ ఫొటో పోస్ట్‌చేయడంపై హెగ్డే స్పందిస్తూ రాహుల్‌ గాంధీ మూర్ఖుడని, ప్రపంచంలో బుద్ధిహీనులుగా పేరొందిన వారిలో ఆయన ఒకరని వ్యాఖ్యానించారు. కాగా, మోదీలైస్‌ అనే పదం తమ డిక్షనరీల్లో దేంట్లోనూ లేదని ఆక్స్‌ఫర్డ్‌ స్పష్టంచేసింది. గాడ్సేను పొగుడుతూ హెగ్డే ట్వీట్‌ చేíసినా దానిని కొద్దిసేపటికే తొలగించారు. తన ఖాతా హ్యాకింగ్‌కు గురైందనీ, ఆ ట్వీట్‌ తాను చేయలేదని ఆయన చెప్పారు.

రాజీవే పెద్ద హంతకుడు: బీజేపీ ఎంపీ
గాడ్సేను ప్రస్తావిస్తూ కర్ణాటకకే చెందిన మరో బీజేపీ ఎంపీ చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. ‘గాడ్సే చంపింది ఒకరిని. ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ చంపింది 72 మందిని. కానీ రాజీవ్‌ గాంధీ ఏకంగా 17 వేల మందిని హత్య చేశారు. ఈ ముగ్గురిలో ఎవరు అత్యంత క్రూరుడు?’ అని మంగళూరు ఎంపీ నళిన్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. నెటిజన్లు, కాంగ్రెస్‌ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్వీట్‌ను తొలగించి, క్షమాపణలు చెబుతూ నళిన్‌ మరో ట్వీట్‌ చేశారు.  

గాంధీ.. పాక్‌ జాతిపిత: బీజేపీ ప్రతినిధి
గాంధీజీ.. పాకిస్తాన్‌ జాతిపిత అంటూ బీజేపీ మీడియా వ్యవహారాల బాధ్యతలు చూసే అనిల్‌ సౌమిత్ర తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌పెట్టారు. భారత్‌లో గాంధీ వంటి వారు కోట్ల మంది పుట్టారని, వారిలో కొందరు దేశానికి ఉపయోగపడగా, మరికొందరు పనికిరానివారని సౌమిత్ర పేర్కొన్నారు. దీనిపై బీజేపీ తక్షణమే స్పందించింది. సౌమిత్రను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top