మౌనీబాబా సర్కార్‌కు.. మాకూ తేడా ఇదే: అమిత్‌షా

Amit Shah Slams Rahul Gandhi in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మౌనీబాబా మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉన్న తేడా చెప్పడానికి ఒక సర్జికల్‌ స్ట్రైక్‌ చాలాని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్‌ మహాజన్‌ ఆధ్వర్యంలో జరిగిన విజయ లక్ష్య–2019 యువ మహాధివేశన్‌ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

2019లో నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖామయన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చే బాధ్యత బీజేవైఎందేనని తెలిపారు. రజాకార్లకు వ్యతిరేకంగా భారత సైనికులు ప్రాణాలర్పించారని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమరవీరులను అవమానపరిచిందని మండిపడ్డారు. మజ్లీస్‌ భయంతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విమోచన దినం పాటించడంలేదని ధ్వజమెత్తారు. విమోచన దినం మరవడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు. తెలంగాణలో కూడా సర్కార్‌ మారాలని, ఇక్కడ బీజేపీ సర్కార్‌ వస్తే బలిదానాలు చేసిన వారికి ఘనమైన నివాళులర్పిస్తామన్నారు. ప్రస్తుతం దేశం కోసం పనిచేసే సమయం ఆసన్నమైందని, ఇప్పటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు యువమోర్చ కార్యకర్తలు మోదీ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మోదీకి ప్రత్యర్థి ఎవరో తెలియని కూటమితో పోటీ ఉంటుందన్నారు.

నాలుగున్నరేళ్లలో మోదీ ఏం చేశారని రాహుల్‌ ప్రశ్నిస్తున్నారని, నాలుగు తరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు తమను ప్రశ్నించే అధికారం లేదన్నారు. పాకిస్తాన్‌తో ఆట పాట వల్ల దేశంలో ఎక్కడ చూసినా ఉగ్రదాడులు జరిగాయన్నారు. సర్జికల్‌ స్ట్రైక్‌ అయ్యాక దేశం పేరు విశ్వంతరాల వరకు మారు మోగిందని తెలిపారు. దేశంలో జవాన్లు, మానవ హక్కులు కాంగ్రెస్‌కు పట్టవని, రిటైర్డ్‌ సైనికుల కోసం యూపీఎ ఇవ్వని వన్‌ ర్యాంక్‌ పెన్షన్‌ తాము ఇస్తున్నామన్నారు. ఉజ్వల యోజన వల్ల కోట్ల మంది మహిళలు కట్టెల పొయ్యి నుంచి విముక్తి పొందారన్నారు. 14 కోట్ల మంది యువకులకు ముద్రలోన్‌ వచ్చిందని, కోట్ల మంది మహిళలు మరుగుదొడ్లతో ఆత్మగౌరవం పొందారని పేర్కొన్నారు. దేశాన్ని ఒక్కటిగా చేసేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ కూటమికి నాయకులు లేరని, అలాంటి కూటమిని ప్రజలు నమ్మరన్నారు. బీజేపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్‌ షా బీజేవైఎం కార్యకర్తలకు సూచించారు.  

చదవండి: ‘రఫేల్‌’లో రాహుల్‌ ఫెయిల్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top