‘తొండి’ ఆటగాడు బాబు

Ambati Rambabu Fires On Chandrababu - Sakshi

ప్రజలు చంద్రబాబును బహిష్కరిస్తారు 

23న అల్లర్లు సృష్టించేందుకు కుట్ర

వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి

విజయవాడ సిటీ: ప్రజాస్వామ్య భారతదేశంలో..చంద్రబాబు క్రీడా స్ఫూర్తిలేని ఓ తుంటరి (తొండి) ఆటగాడని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వీవీ ప్యాట్‌లు, ఈవీఎంలు, ఎలక్షన్‌ కమిషన్, ఎగ్జిట్‌ పోల్‌ దేనిపైనా చంద్రబాబుకు నమ్మకం లేదని, ఆఖరికి న్యాయస్థానాలను కూడా చంద్రబాబు నమ్మడం లేదన్నారు.  న్యాయస్థానాలు ఎన్ని పిటిషన్లు తిరస్కరిస్తున్నా చంద్రబాబుకు సిగ్గురావడం లేదని మండిపడ్డారు.  విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మంగళవారం  విలేకరులతో మాట్లాడారు.  

చంద్రగిరిలో రీపోలింగ్‌కు ఆదేశిస్తే అన్యాయం, అక్రమం అని చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని, తరువాత కోర్టులో పిటిషన్‌ వేస్తే న్యాయస్థానం తిరస్కరించిందన్నారు. అంతకుముందు వీవీ ప్యాట్‌లు ఐదు కాదు 50 లెక్కించాలని కోర్టుకు వెళ్లారని, దానిపై కోర్టు చురకలు అంటించిందన్నారు. అయినా కూడా సిగ్గులేకుండా నిన్న ఒక టెక్నీషియన్‌ చేత చంద్రబాబు బృందం వందశాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాలని ఒక పిటిషన్‌ వేయించారని దుయ్యబట్టారు.  గౌరవ అత్యున్నత న్యాయస్థానం అది సాధ్యం కాదని చెబుతూ,  ఒక ఆదేశం జారీ చేసిందన్నారు. అంతేకాకుండా  విలువైన కోర్టు సమాయాన్ని వృధా చేయవద్దని నోటీస్‌ రిలీజ్‌ చేసినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదని మండిపడ్డారు.   తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని అంబటి విమర్శించారు.

చెడ్డ కార్మికుడు చంద్రబాబు.. 
ఓటమి భయంతో మమతా బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి అంటూ దేశమంతా తిరుగుతున్నాడని అంబటి ఎద్దేవా చేశారు.  చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో తగదాలు పెట్టుకుంటాడని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన వ్యాఖ్య చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందని అన్నారు.
 
23న ఫలితాలైనా నమ్ముతాడా?.. 
ఎగ్జిట్‌ పోల్, ఈవీఎం, వీవీ ప్యాట్‌లను నమ్మని చంద్రబాబు 23వ తేదీన వెలువడే ఫలితాలనైనా నమ్ముతారా అని అంబటి ప్రశ్నించారు. ఈవీఎంలను మోడీ, వైఎస్‌ జగన్‌ కలిసి శాటిలైట్‌ ద్వారా మేనేజ్‌ చేశారని ఆరోపించినా ఆశ్చర్యం లేదన్నారు. 23వ తేదీన కౌంటింగ్‌ కేంద్రాల వద్ద చంద్రబాబు కోటరీ గందరగోళం సృష్టించేందుకు కుట్ర చేస్తోందని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేవినేని ఉమా పోలవరం పేరుతో ఇష్టారీతిగా ప్రజల సొమ్ము మెక్కాడని, అధికారంలోకి వచ్చిన తరువాత తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. అదే విధంగా బుద్ధా వెంకన్న తొడలు కొడుతున్నాడని, మీసాలు తిప్పి, తొడలు కొట్టినవారు ఎవరూ పాలించిన దాఖలాలు లేవన్నారు. నూటికి నూరుపాళ్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని అంబటి స్పష్టం చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top