సొంత కులానికే చంద్రబాబు సేవ

Amanchi Krishna Mohan Fires On Chandrababu - Sakshi

ఆమంచి కృష్ణమోహన్‌ ఆగ్రహం 

కీలక పోస్టుల్లోనూ తన సామాజికవర్గం వారినే నింపుకున్నారు 

సీఎంఓ నుంచి అన్నిచోట్లా వాళ్లే 

బాబు చుట్టూ ఆయన కులం విష వలయంగా తయారైంది

పైగా తనకు కులపిచ్చి లేదని ఆయన చెప్పుకుంటున్నారు 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కులానికే సేవ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కేవలం గుప్పెడు చేసి, సొంత కులానికి దోసెడు దోచిపెడుతున్నారని ఆరోపించారు. తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి గురువారం హైదరాబాద్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత కులానికే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పోలీసు, పరిపాలన, రెవెన్యూ యంత్రాంగంలోని కీలక పోస్టుల్లో చంద్రబాబు తన సామాజికవర్గం వారినే నింపుకుని, వచ్చే ఎన్నికల్లో వారి సహకారంతో గెలుపొందాలని చూస్తున్నారని, కానీ అది జరగదని తేల్చిచెప్పారు. ఆమంచి ఇంకా ఏం మాట్లాడారంటే...
 
‘‘రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ వంటిదైన సీఎం కార్యాలయంలో(సీఎంవో) నలుగురు సీనియర్‌ అధికారులు కార్యదర్శులుగా ఉండగా, అందులో సాయిప్రసాద్, రాజమౌళి అనే వారిద్దరూ చంద్రబాబు సామాజిక వర్గంవారే. పోలీసు సమాచారంతోపాటు ఇతర రంగాల సమాచారాన్ని సేకరించి ముఖ్యమంత్రికి నివేదించే ఇంటెలిజెన్స్‌ శాఖాధిపతి, అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు ఏబీ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి సామాజికవర్గం అధికారే. కొత్తగా ఏర్పాటు చేసిన లా అండ్‌ ఆర్డర్‌ కో–ఆర్డినేషన్‌ డీఐజీ పదవిలో ఉన్న ఘట్టమనేని శ్రీనివాసరావు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మనిషే. ఏబీ వెంకటేశ్వరరావుకు శిష్యులైన యోగానంద్, మాధవరావు అనే రిటైర్డు పోలీసు అధికారులను చట్టంలో లేని విధంగా జీవోలు ఇచ్చి కీలక స్థానాల్లో కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకోవడానికి ఆయన పర్సనల్‌ సెక్రెటరీని సంప్రదించాల్సి ఉంటుంది. ఆ పోస్టులో చంద్రబాబు సామాజికవర్గం అధికారే ఉన్నారు. షార్ట్‌కట్‌లో సీఎంకు సమాచారాన్ని అందజేసే టీడీ జనార్దన్‌ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. టీడీపీ ఏపీ అధ్యక్షుడుగా పేరుకే కళా వెంకట్రావు ఉన్నారు. ఆయనకు సమాంతరంగా ప్రోగ్రామింగ్స్‌ కమిటీ ఛైర్మన్‌ పేరుతో డీవీవీ చౌదరి అనే వ్యక్తిని నియమించారు. మేమంతా వెళ్లి ఆయనకు దండం పెట్టి, అర్జీ ఇచ్చి రావాల్సి వచ్చేది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ సీఎం చంద్రబాబు వర్గం మనిషే. అంతేకాదు చంద్రబాబుకు బంధువు కూడా. 

చంద్రబాబు ప్రయత్నాలు ఫలించవు 
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూసి బెంబేలెత్తి చాలామంది మేధావులైన రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. వారి స్థానంలో కేంద్ర సర్వీసుల నుంచి 20 మంది అధికారులను డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చుకుంటే అందులో 15 మంది చంద్రబాబు సామాజికవర్గం వారే ఉన్నారు. వెంకటరెడ్డి అనే అధికారి వారిలో ఉంటే అతడు రెడ్డి కనుక ముఖ్యమంత్రి ఆ నియామకాన్ని నిలిపేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వ్యవహారంపై రేపు తెల్లవారే వరకూ చెప్పగలను. చంద్రబాబు తన కులానికే ప్రాధాన్యం ఇచ్చుకుంటున్నారు. పైగా తనకు కులపిచ్చి లేదని చెప్పుకుంటున్నారు. ఆయన చుట్టూ ఆయన కులం ఒక విషవలయంగా తయారై రాష్ట్రాన్ని పెకిలిస్తోంది. ఆది చంద్రబాబు అదుపులో ఉందో లేదో కూడా నాకు తెలియదు. సొంత సామాజికవర్గం అధికారుల అండతో వచ్చే ఎన్నికల్లో నెగ్గాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ, అది సాధ్యం కాదు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఎంతటి భారీ మెజారిటీతో గెలుపొందుతారో అందరూ చూస్తారు’’ అని ఆమంచి స్పష్టం చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top