అజిత్‌ పవార్‌కు ఝలక్‌ ఇచ్చిన ఎమ్మెల్యేలు

All MLAs Are With Me Says Sharad Pawar Not With Ajit - Sakshi

వెనక్కి వస్తు‍న్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు

మా వెంటే 50 మంది ఎమ్మెల్యేలు: శరద్‌

సుప్రీం విచారణపై తీవ్ర ఉత్కంఠ

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రాజకీయాల్లో అనుహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్య పార్టీలయిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాయి. ఎమ్మెల్యేలతో వరస భేటీలతో నేతలు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని బలపరీక్షలో నెగ్గించుకునేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు దూతలను ప్రయోగిస్తోంది. అయితే ఎన్సీపీ నేత అజిత్‌ పవర్ ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే వారంతా ఆయనకు ఝలక్‌ ఇచ్చారు. శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఫడ్నవిస్‌కు మద్దతు ప్రకటించిన అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఆదివారం వారంతా ఎన్సీపీ చీఫ్‌​ శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీలో 50 మంది సభ్యులు శరద్‌ వెంటే ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. (అసలు సీనంతా మోదీ, పవార్‌ భేటీలోనే..!)

కేవలం నలుగురు మాత్రమే అజిత్‌ వెంట ఉన్నారని వారు కూడా వెనక్కి రాకపోతే అనర్హత వేటు తప్పదని శరద్‌ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు శివసేన కూడా తన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించి కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శరద్‌ పవార్‌త్‌ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలను కాపాడుకునే అంశంపై వారు చర్చించారు. మరోవైపు అసెంబ్లీ బల పరీక్షలో ఫడ్నవిస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ విప్‌ జారీచేసింది. ఇదిలావుండగా దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. మహారాష్ట్ర గవర్నర్‌ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోర్టును కోరారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ  చేపట్టనుంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాగా మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం ఇదివరకే పావులు కదిపింది. వారి మద్దతుతో బల పరీక్షలో నెగ్గాలని ప్రణాళిలకు రచిస్తోంది. కానీ శివసేన, ఎన్సీపీ వర్గాల సమాచారం ‍ప్రకారం వారిలో మెజార్టీ సభ్యులు సేనకే మద్దతు ‍ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top