‘మహా’ మలుపు.. అలా... ముగిసింది!

NCP And Shiv Sena Face Floor Test In Maharashtra Assembly - Sakshi

అధికారమే లక్ష్యంగా పార్టీల పావులు

ఆటలో చివరికి నెగ్గింది బీజేపీనే

ఆశకు పోయి బోర్లాపడ్డ శివసేన

వ్రతం చెడ్డా ఫలం దక్కని కాంగ్రెస్‌

ఎన్‌సీపీలో శరద్‌ బదులు మరో పవార్‌

పెళ్లికి ముహూర్తం కుదిరింది. రాత్రి శుభలేఖలు అచ్చయ్యాయి. ఉదయాన్నే పెళ్లి జరిగింది!!. కాకపోతే పెళ్లి కొడుకు మారిపోయాడు. ఇదీ... మహారాష్ట్ర పదవీ కల్యాణానికి శుభం కార్డు పడిన తీరు!!. బహుశా... దీనికి మించిన అర్ధరాత్రి డ్రామాను చూడలేమేమో!!. ఎందుకంటే శుక్రవారం రాత్రి శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. ఆ వార్తను శనివారం ఉదయం పత్రికల్లో చదువుతుండగానే... బీజేపీ నేత ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, ఎన్‌సీపీ నేత అజిత్‌పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు టీవీల్లో, మొబైల్‌ ఫోన్లలో ఫ్లాష్‌లు వెల్లువెత్తాయి. రాత్రికి ఆ ఫ్లాష్‌ల తీరూ మారింది. శరద్‌ పవార్‌ తన పవర్‌ చూపిస్తారా? మరి ఈ మహా ‘మలుపు’లో ఎవరి భాగమెంత...

మహారాష్ట్ర ఎన్నికల తీర్పు స్పష్టంగానే ఉంది. కాకపోతే గెలిచిన బీజేపీ–శివసేన మధ్య ఒప్పందమే అస్పష్టం. ముఖ్యమంత్రి పదవిని సగం–సగం పంచుకుందామని చెప్పిన బీజేపీ... మాట మార్చిందన్నది శివసేన వాదన. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన శివసేన.. బీజేపీకి టాటా చెప్పి ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసింది. ఎన్‌సీపీ ఓకే. కాంగ్రెస్‌ మాత్రం సైద్ధాంతిక విభేదాలున్న సేనతో కలవడమెలా? అని కొన్నిరోజులు మల్లగుల్లాలు పడింది. అధికారం ముందు ఆ అభ్యంతరాలన్నీ చిన్నబోయాయి. చివరకు పచ్చజెండా ఊపింది. (ఫలించిన మోదీ, షా వ్యూహం!)

‘నైతిక’ ప్రశ్నలకు తావుందా?
రాజకీయమంటే అధికారం కోసం!!. బీజేపీని వదిలేటపుడు శివసేన ఇచ్చిన సంకేతమిదే. ఎలాంటి సారూప్యతా లేని సేనతో కలవటానికి కాంగ్రెస్, ఎన్‌సీపీలు పచ్చజెండా ఊపినప్పుడు కనిపించిందీ ఇదే. ఈ సూత్రాన్ని తనకు తాను అన్వయించుకున్నాడు ఎన్‌సీపీ నేత అజిత్‌పవార్‌. వెంట వచ్చిన ఎమ్మెల్యేలతో బీజేపీని కలిశాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం.. నైతికత అనే ప్రశ్నల్ని లేవనెత్తే అర్హత ఏ పార్టీకీ లేదనే అనుకోవాలి. బహుశా... అందుకేనేమో!! శివసేనతో జట్టుపై కాంగ్రెస్‌ తేల్చనంతవరకూ బీజేపీ కూడా మౌనంగానే ఉంది. శుక్రవారం రాత్రి సేనతో దోస్తీకి కాంగ్రెస్‌ సై అనగానే... కాంగ్రెస్‌ సైద్ధాంతిక పాతివ్రత్యం దెబ్బతిన్నది కనక వేగంగా పావులు కదిపేసింది. కానీ తెల్లవారు జామునే రాష్ట్రపతి పాలన తొలగించి ఫడ్నవిస్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించి న గవర్నరు పాత్ర ప్రశ్నార్హమే. తగినంత మద్దతుందని వచ్చారు కనక అవకాశమిచ్చాననేది ఆయన మాట. నిజానికి అర్హతలతో పనిలేకుండా తమకు నచ్చినవారిని గవర్నర్లుగా నియమించే సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వాలన్నీ కొనసాగిస్తున్నాయి. కాబట్టి వారి ప్రవర్తన కేంద్రానికి అనుకూలంగా ఉండదని ఆశించటమే పొరపాటు. (బలపరీక్షపై ఉత్కంఠ..!)

పవార్‌ – మోదీ భేటీలోనే...?
అసలు శరద్‌పవార్‌– ప్రధాని నరేంద్రమోదీ ఈ మధ్య ఎందుకు భేటీ అయ్యారు? భేటీ వారిద్దరికే పరిమితం కనక బయటివారు దీన్ని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. తాను మొదటి నుంచీ కాంగ్రెస్‌తో ఉన్నాను కనక బీజేపీతో కలిస్తే ఇన్నాళ్లూ కష్టపడి సంపాదించుకున్న మరాఠా వీరుడు, పెద్దమనిషి అనే ట్యాగ్‌లు పోతాయని పవార్‌ భయపడి ఉండొచ్చు. కాకపోతే బీజేపీ పని జరిగేలా అజిత్‌పవార్‌ తిరుగుబాటు చేసే ఆలోచనకు అక్కడే బీజం పడి ఉండొచ్చన్న అనుమానాలూ ఉన్నాయి. ఇప్పుడు శరద్‌పవార్‌ తాను పోరాడతాననే చెబుతున్నారు. కానీ ఆ పోరాటం అజిత్‌ను బీజేపీకి దూరంగా ఉంచుతుందని, సేన–కాంగ్రెస్‌–ఎన్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాత్రం ఆశించలేం.

అందుకేనా ఆ ధీమా..?
మహారాష్ట్ర అంటే ఇతర రాష్ట్రాల్లాంటిది కాదు. ముంబైతో సహా దేశాన్ని నడిపించే ఆర్థికాధికార కేంద్రాలన్నీ ఉన్నదిక్కడే. అలాంటి రాష్ట్రంలో.. ప్రజాతీర్పు అనుకూలంగా వచ్చినా అధికారం అందకపోతే బీజేపీ ఊరుకుంటుందా? గోవా, కర్ణాటక, హర్యానా లాంటిచోట్ల ప్రజాతీర్పును తమకు అనుకూలంగా మార్చుకున్న పార్టీ ఇక్కడెందుకు వెనకడుగేస్తుంది? అందుకే తొలి నుంచీ తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతుందని బీజేపీ పదేపదే చెబుతూ వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అది చాలదని, మరో 20 మంది కావాలని దానికి తెలియనిదా? ఆ మిగిలిన 20 మందినీ ఎలాగైనా సంపాదిస్తామనే ధీమాను అందులో చూడాలా? మరి అజిత్‌ పవార్‌ ఫెయిలయి ఎమ్మెల్యేలంతా శరద్‌పవార్‌ వెంటే నిలబడితే ఏమవుతుంది? బీజేపీ ఆ అవమాన భారాన్ని భరించగలదా? చూడాల్సిందే!!.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top