టీడీపీ నేతల అరెస్ట్‌లపై ఆ పార్టీది తప్పుడు ప్రచారం

Adimulapu Suresh Comments On TDP Leaders - Sakshi

చేసిన నేరాల నుంచి రక్షణ కల్పించాలనే టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా దళితుడ్ని నియమిస్తే టీడీపీ అడ్డుకుంది 

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ధ్వజం 

సాక్షి, అమరావతి: టీడీపీ నేతల అరెస్ట్‌లపై ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మండిపడ్డారు. అరెస్ట్‌లు, చేసిన నేరాల నుంచి రక్షణ కల్పించాలనే టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలిశారని ధ్వజమెత్తారు. తన ఐదేళ్ల పాలనలో టీడీపీ రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మంత్రి సురేశ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

► ఇంగ్లిష్‌ మీడియాన్ని అడ్డుకుని పేదలకు టీడీపీ అన్యాయం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా దళితుడ్ని నియమిస్తే అడ్డుకుంది. వీటిపై రాష్ట్రపతి టీడీపీ ఎంపీలను ప్రశ్నించి ఉంటే ఏం సమాధానం చెప్పేవారు? 
► చంద్రబాబు పీఎస్‌ ఇంట్లో సోదాల తర్వాత రూ. 2 వేల కోట్ల లావాదేవీలకు ఆధారాలు బయటపడ్డాయి.  
► చంద్రబాబుకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు.  
► ఏడాది కాలంలో మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఏమాత్రం వేలుపెట్టి చూపే పరిస్థితి లేదు. ఏడాదిలోనే నాలుగు కోట్ల మందికి రూ.43 వేల కోట్లను నేరుగా నగదు బదిలీ చేశాం. మంచి వర్షాలు పడుతూ పంటలు పండుతున్నాయి. 
► రాష్ట్రంలో ఏం మాట్లాడినా ప్రజలు నమ్మరనే ఉద్దేశంతో ఢిల్లీ వెళ్లి అక్కడ వాస్తవాలను వక్రీకరించి చెప్తే వింటారని టీడీపీ ఎంపీలను చంద్రబాబు ఢిల్లీకి పంపారు.
► ప్రభుత్వం రాజధాని భూముల్లో 54 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నామని టీడీపీ రాష్ట్రపతికి చెప్పి ఉంటే బాగుండేది.  
► అలాగే ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయనకు చెప్పాల్సింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించి చరిత్రలోనే గత ఏడాది కాలంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యధికంగా ఖర్చు చేసిందని రాష్ట్రపతికి చెప్పి ఉండాల్సింది.  
► దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం దళితుల కాలనీల్లో కాదు.. విజయవాడ నడిబొడ్డున కొలువు దీరబోతుంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top