రాజస్తాన్‌లో 74% పోలింగ్‌

74% polling in Rajasthan elections - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ అసెంబ్లీకి శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటింగ్‌ ముగిసే సాయంత్రం 5 గంటల సమయానికి 74.02% పోలింగ్‌ నమోదైందని అధికారులు తెలిపారు. గత 2013 ఎన్నికల్లో 75.23% పోలింగ్‌ నమోదైంది. అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను ఒక్కటి మినహా 199 సీట్లకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్ధి లక్ష్మణ్‌ సింగ్‌ హఠాన్మరణంతో ఆల్వార్‌ జిల్లా రామ్‌గఢ్‌ నియోజకవర్గం ఎన్నిక నిలిచిపోయింది. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 4.74 కోట్ల ఓటర్ల కోసం 51, 687 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. స్వల్ప ఘటనలు మినహా రాష్ట్ర మంతటా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే, రాజస్తాన్‌ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఉన్నారు.

సీఎం అభ్యర్ధి వసుంధర 2003 నుంచి పోటీ చేస్తున్న ఝల్రాపటన్‌ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. వసుంధర ప్రధాన ప్రత్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత జశ్వంత్‌ సింగ్‌ తనయుడు మాన్వేంద్రసింగ్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గట్టి పోటీ నిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈయన కాషాయాన్ని వదిలి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతోపాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న టోంక్‌ స్థానం నుంచి సచిన్‌ పైలట్‌ పోటీ చేస్తుండగా ఆయన ప్రధాన ప్రత్యర్ధిగా బీజేపీ ఏకైక ముస్లిం అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి యూనస్‌ ఖాన్‌ బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. గతంలో దౌసా, అజ్మీర్‌ లోక్‌సభ స్థానాల నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన పైలట్‌ ఈసారి అసెంబ్లీ బరిలో ఉన్నారు. దాదాపు 130 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ముఖాముఖి తలపడుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 160, కాంగ్రెస్‌కు 25 మంది సభ్యుల బలం ఉంది. తాజా ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.

మైళ్ల దూరం నడిచి...
జోధ్‌పూర్‌: రాజస్తాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాథూర్, మండి వంటి ప్రాంతాల్లో పోలింగ్‌ ఓ గంట ఆలస్యంగా ప్రారంభమవ్వగా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న బర్మార్, జైసల్మేర్‌ జిల్లాల ప్రజలు ఎడారిలో కొన్ని మైళ్ల దూరం నడిచి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలు వీరు నివసించే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో ఉంటాయి. దూరాన్ని సైతం లెక్క చేయకుండా మారుమూల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌కు హాజరయ్యారు. ఈసారి పోలింగ్‌లో పాల్గొన్న మహిళలు సంఖ్య కూడా పెరిగింది. 101 ఏళ్ల పాలీదేవి అనే మహిళ బర్మార్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. అలాగే బుండి జిల్లా హిందోలీ ప్రాంతానికి చెందిన 102 ఏళ్ల కుస్నీబాయ్‌ చేతి కర్ర సాయంతో ఓటు వేసేందుకు వచ్చారు. జోథ్‌పూర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలింగ్‌ బూత్‌ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బరన్‌ జిల్లా సుఖ్‌నాయర్‌ గ్రామ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. తమ గ్రామ సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోకపోవడంతో నిరసన తెలుపుతూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నామని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top