కొంపముంచిన ‘హిందూత్వ ఎజెండా’ | 5 State Elections a Warning to BJP | Sakshi
Sakshi News home page

Dec 12 2018 5:57 PM | Updated on Dec 12 2018 5:59 PM

5 State Elections a Warning to BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఘంటారావంగా భావిస్తారు. ఈ మూడు రాష్ట్రాలను కలుపుకొని మొత్తం 65 లోక్‌సభ సీట్లు ఉండగా, గత లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 62 సీట్లను సాధించింది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. అయినప్పటికీ రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఘంటారావంగాగానీ, రాజకీయ పండితులు వర్ణించినట్లు సెమీ ఫైనల్స్‌గాగానీ పరిగణించలేం. కాకపోతే ఓ హెచ్చరికగా చూడవచ్చు.

ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటుచేసేంతగా మెజారిటీలు వచ్చి ఉన్నట్లయితే సెమీ ఫైనల్‌గా చూసే అవకాశం ఉండేది. కానీ ఒక్క చత్తీస్‌గఢ్‌లో తప్పించి, మిగతా రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. కనుక ప్రభుత్వం వ్యతిరేకత ఉండడం సహజం. అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లో అది ప్రతిఫలించలేదంటే ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కున్న మంచిపేరు కావచ్చు.

ఇక తెలంగాణలో గత ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుపొంది.. ప్రస్తుతం వందకుపైగా సీట్లకు పోటీ చేసిన బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. మిజోరంలో రెండు సీట్లను ఆశించి రంగంలోకి దిగి ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ప్రధానంగా ఎన్నికలు జరిగిన ఈ మూడు రాష్ట్రాలు హిందీ బెల్టులో ఉండడం, ప్రచారం చేసుకునే స్థాయిలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు కూడా పెద్దగా లేకపోవడంతో అక్కడ ప్రభుత్వాలను నిలబెట్టుకునేందుకు.. తెలంగాణలో విస్తరించేందుకు బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎత్తుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అంతటి ప్రచారకుడిగా భావించి.. బీజేపీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా రంగంలోకి దింపింది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో విస్తతంగా పర్యటించిన ఆయన ‘రామ్‌, రామ్‌ మందిర్, రామ్‌ రాజ్యం’ గురించే ఎక్కువ మాట్లాడారు.

తెలంగాణ దండకారణ్యంలో రాముడు పర్యటించారని చెప్పినా ఆయన మిగతా మూడు రాష్ట్రాలకు కూడా రాముడితో ఏదో ఒక లింకు పెట్టారు. తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే రాజధాని హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తానని చెప్పారు. రాష్ట్ర వనరులన్నీ ముస్లింలకే దోచిపెడుతున్నారంటూ ప్రజల మధ్య విధ్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారు. ‘రాముడు గీముడు జాన్తా నహీ’ అంటూ తెలంగాణ సెంటిమెంట్‌ ముందు ఆయన ప్రచారం నిలబడలేకపోయింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ‘అభివృద్ధి’ నినాదం ద్వారానే విజయం సాధించిన విషయాన్ని పార్టీ పక్కన పెట్టి కేవలం హిందూత్వ ఎజెండానే ఎత్తుకోవడం వల్ల బాగా నష్టం జరిగిందని బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు సంజయ్‌ కాక్డే అభిప్రాయపడడం గమనార్హం.

2020 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని గాలికొదిలేసిన నేపథ్యంలో అభివృద్ధి ఎజెండాను ప్రచార అస్త్రంగా బీజేపీ చేసుకోలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికైనా హిందూత్వ ఎజెండాను పక్కనపెట్టకపోతే మంగళవారం నాటి ఫలితాలు పునరావృతం కాక తప్పవని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement