ఉదారవాదుల గుండెల్లో గుబులు

ఉదారవాదుల గుండెల్లో గుబులు - Sakshi


నరేంద్రమోదీకి హృదయపూర్వకంగా స్వాగతం చెప్పిన ఉదారవాదులు పునరాలోచనలో పడినట్టు కనిపిస్తున్నారు. మన్మోహన్‌సింగ్ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన వెల్లువలా వచ్చిపడిన అవినీతి ఆరోపణలు ఉదారవాదులకు ఆగ్ర హం కలిగించాయి. పార్లమెంటులోనూ, ఎలక్ట్రానిక్ మీడి యాలోనూ, వార్తాపత్రికలలోనూ, జనసామాన్యంలోనూ కుంభకోణాలపైన తర్జనభర్జన జరుగుతుంటే మన్మోహన్ సింగ్ అంతులేని మౌనం పాటించడం, సోనియా గాంధీ స్పందన ఏమిటో తెలియకపోవడం, రాహుల్‌గాంధీ ఒకటి రెండు సందర్భాలలో నాట కీయంగా అవినీతి వ్యతిరేకతను ప్రదర్శించడానికే పరిమితం కావడంతో ఆగ్రహానికి అవమానం తోడై ఉదారవాద హృదయాలను దహించడం ప్రారంభించింది.

 

 భారతీయ జనతాపార్టీ (భాజపా) ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఎంపిక కావ డం, భీష్మ, ద్రోణ, కృపాచార్యులను పూర్వపక్షం చేసిన మోదీ దేశవ్యాప్తంగా వంద లాది బహిరంగసభలలో కోట్లాది ప్రజలను ఉద్దేశించి అత్యంత శక్తిమంతంగా, ప్రభావ వంతంగా ప్రసంగించడం, ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడం, స్వచ్ఛమైన, సమర్థమైన పరిపాలన, పరిశుభ్రతకు పెద్దపీట, విద్యారంగంలో పెనుసంస్కరణల వంటి వాగ్దానాలు తనదైన శైలిలో ధాటిగా, నిస్సంకోచంగా చేయడంతో నిజంగానే దేశానికి ‘అచ్ఛేదిన్’ (మంచి రోజులు) వచ్చేశాయని సంతోషించారు.

 

 తొలి అడుగులలో విశ్వాసం

 

 ఇరవై సంవత్సరాల సంకీర్ణ సంక్షోభాల అనంతరం భాజపా స్వయంగా లోక్‌సభలో మెజారిటీ పార్టీగా అవతరించడంతో మోదీ ఎన్నికల వాగ్దానాల అమలు నల్లేరు మీద బండిలాగా సాగుతుంది కదా అనుకున్నారు. మహారాష్ట్రలో శివసేనను అంకెకు తీసుకురావడం, హర్యానాలో జాట్ కాకుండా పంజాబీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం గమనించినవారికి మోదీ మామూలు రాజకీయవేత్త కారనీ, తన ఆధి క్యాన్నీ, ఆధిపత్యాన్నీ స్పష్టంగా చాటడం ద్వారా దేశానికి బలమైన నాయకత్వం ప్రసా దించడానికి ప్రయత్నిస్తున్న అసాధారణ నాయకుడనీ, ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ అంతటి శక్తిశాలి అనీ మీడియా ప్రశంసిస్తుంటే ఏకీభవిస్తూ ఆనందించారు.

 

 మతకలహాలు జరిగినప్పుడు, కొందరు సాధువులూ, సాధ్వీమణులూ ఇతర మతాల గురించి అడ్డగోలుగా మాట్లాడినప్పుడూ, ‘ఘర్‌వాప్సీ’ అంటూ మతమార్పి డులను తిరగదోడుతూ అలజడి సృష్టించినప్పుడూ ఉదారవాదులు కలత చెందారు. అంతలోనే ఈ ధోరణులను గర్హిస్తున్నట్టు మోదీ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రకటిం చినప్పుడు ఊరట చెందారు. గుజరాత్‌లో లాగానే దేశం అంతటా అభివృద్ధీ, మత వాదం సమాంతరంగా సాగుతాయంటూ వామపక్ష మేధావులు చేస్తున్న హెచ్చ రికలను పెడచెవిన పెట్టారు. అభివృద్ధికే మోదీ అంకితభావంతో కృషి చేస్తారనీ, మత వాదాన్ని ప్రోత్సహించరనీ తమకు తాము నచ్చజెప్పుకున్నారు.

 

 కొత్త సీసాలో పాత సారా చందమేనా?

 

 కార్మిక చట్టాలకు సవరణ తెచ్చినప్పుడు పరిశ్రమలు వృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు విరివిగా రావాలన్నా కార్మిక చట్టాలను సరలీకరించడం అవసరమే కదా అనుకు న్నారు. ‘జన్‌ధన్’ యోజనతో పేదవారి ఖాతాలలో డబ్బు జమచేయాలని తలబోసే ప్రధాని కార్మికుల కడుపుకొడతారని భావించడం అన్యాయమని కూడా భావించారు. భూసేకరణ చట్టాన్ని సవరించి గ్రామసభలు జరపకుండానే, రైతుల సమ్మతిలేకుండా భూములు స్వాధీనం చేసుకోవడాన్ని చట్టబద్ధం చేస్తూ రాష్ట్రపతి చేత సుగ్రీవాజ్ఞ (ఆర్డి నెన్స్) జారీచేయించినప్పుడు జైరాంరమేష్, జయంతీ నటరాజన్‌ల హయాంలో పర్యా వరణ పరిరక్షణ పేరుమీద అనుమతులు ఇవ్వకుండా నిలిపివేసిన అనేక ప్రాజెక్టులకు సత్వరం అనుమతులు రాకపోతే ఉపాధికల్పన ఎట్లా సాధ్యం అవుతుంది, నిరుద్యోగ నిర్మూలన ఎట్లా కుదురుతుందంటూ ప్రశ్నించుకొని సమాధానం చెప్పుకున్నారు.

 

 ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ (విధాన సంఘం) ను నెలకొల్పినప్పుడు దీనికోసం ఇంత సన్నాహక ప్రచారం (బిల్డప్) అవసరమా అని విసుక్కున్నారు.
 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగ మధ్యంలో ప్రధాని మోదీ ప్రణాళికా సంఘం కాలం చెల్లిందనీ, రద్దు చేసి దాని స్థానంలో అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానని ప్రకటించినప్పుడు మంచిదే కదా అనుకున్నారు. ప్రణాళికా సంఘం సోషలిస్ట్ భావజాలానికి ప్రతీక (సోవియెట్ యూనియన్ నుంచి అరువు తెచ్చుకున్న ఆలోచన) కనుక దానికి బదులు విపణి చోదక ఆర్థిక వ్యవస్థకు సంకేతప్రాయంగా సరికొత్త వ్యవస్థను ఆవిష్కరిస్తారని ఎదురు చూశారు. తీరా నీతి ఆయోగ్‌లో పేరు మారింది తప్ప ఎడమ చేయి బదులు వామహస్తం అనడం మినహా అంత గొప్ప మార్పు ఏమీ కనిపించకపోవడంతో ఆశాభంగం చెందారు. జాతీయాభివృద్ధి మండలి స్థానంలో ముఖ్యమంత్రులతో కూడా మండలిని ఏర్పాటు చేయడం వల్ల సమాఖ్యభావన అమలులోకి వస్తుందనే అభిప్రాయంతో ఏకీభవించడం కష్టం. ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపు చేసిన తర్వాత నీతి ఆయోగ్ నుంచి రాష్ట్రాలకు నిధులు అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉండవు.

 

 మోదీ శకం ప్రారంభమై దాదాపు ఏడు నెలలు గడచిన తర్వాత, ఇన్ని అను భవాలు ఎదురైన అనంతరం ఉదారవాదులకు అకస్మాత్తుగా ఒక అనుమానం వచ్చింది. ‘స్వచ్ఛ భారత్’ వంటి నినాదాలూ, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ఉద్బోధలూ, ఆత్మ విశ్వాసం ఉట్టిపడే ఆశ్వాసనలూ పక్కన పెడితే ఇంతవరకూ మోదీ ప్రభుత్వం ఒక్క కార్యక్రమాన్ని కూడా కాలపరిమితితో ప్రకటించలేదని అర్థమైంది. 2019 కల్లా స్వచ్ఛభారత్ స్వప్నం సాకారం అవుతుందని చెప్పారు కానీ ఈ లోగా ఫలానా సంవత్సరానికల్లా ఫలానా పనులు చేస్తామంటూ చెప్పలేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ఆకర్షించారు కానీ ప్రభుత్వం తరఫున ఏమి చేయబోయేదీ ఇంకా స్పష్టం కాలేదు.


ఇంతకాలం ప్రజలకు అందింది ఏమంటే గంభీరమైన, ఆశాజనకమైన, విశ్వాసభరితమైన, అందమైన ప్రకటనలు. చాలా వేగంగా పరిశుభ్రంగా ముందుకు దూసుకుపోతామన్న విశ్వాసం. అంతకుమించి నికరంగా జరిగింది ఇంత వరకూ ఏమీలేదు. జన్‌ధన్ యోజన యూపీఏ సర్కార్ మనీట్రాన్స్‌ఫర్ స్కీమ్‌కి హిందీ పేరు. మొన్నటి వరకూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా పనిచేసిన మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా ప్రణాళికా సంఘం ప్రమేయంతో ఆవిష్కరించే కేంద్ర పథకాలకు ఇంగ్లిష్ పేర్లో, జాతీయ నాయకులతో వచ్చే పేర్లో పెట్టేవారు. వాటిని మార్చడానికి ఎవ్వరూ ప్రయత్నించేవారు కాదు. ఇప్పడు మోదీ సర్కార్ పేర్లలో భారతీయత ఉట్టిపడేలా చూసుకుంటున్నది. విషయం మాత్రం దాదాపుగా పాతదే.

 

 అయినా ఫర్వాలేదనుకున్నారు ఉదారవాదులు. మౌనం మూర్తీభవించిన వ్యక్తి స్థానంలో హాయిగా, కర్ణపేయంగా, జనరంజకంగా, సాధికారికంగా మాట్లాడే వ్యక్తి ప్రధాని పదవిలోకి వచ్చారు. ‘రైట్‌మ్యాన్, రైట్‌టైమ్, రైట్‌ప్లేస్’ అంటూ ఇంగ్లిష్ పత్రి కలు కీర్తించినట్టు సకాలంలో యూపీఏ అనే తలభారం వదిలి మోదీత్వం రూపంలో కొత్త వెలుగు దేశ ప్రజల జీవితాలలో ప్రవేశించిందనే అభిప్రాయం కలిగింది. భాజపా నాయకత్వంలోని ఎన్‌డీఏ-2 ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు ఇంతవరకూ వినిపించలేదు. కుంభకోణాల, కుంభకర్ణుల ప్రభుత్వం పోయి అవినీతి మకిలి లేని ప్రభుత్వం వచ్చినందుకు సంతోషమే కదా. ప్రభుత్వోద్యోగులు ఎన్నడూ లేని విధంగా ఉదయం తొమ్మిది, పది గంటల మధ్య కార్యాలయాలకు చేరుకుం టున్నారు.

 

 సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్య వరకూ ఉంటున్నారు. పని ఇదివర కటి కంటే ఎక్కువ చేస్తున్నారో లేదో తెలియదు. ఈ ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ప్రాథ మిక సదుపాయాలు-రోడ్లు, విద్యుత్, వగైరాలకు) అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అధికంగా పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్)పైనే ఆధారపడుతున్నది. అంబానీలూ, అదానీలూ షరా మామూలే. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచివేసింది. డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర. అయి నప్పటికీ పట్టణ ప్రాంతాలలో ఎదిగివస్తున్న మధ్యతరగతి ప్రయోజనాలకు భంగం కలగకుండా, కార్పొరేట్లకు సానుకూలంగా వ్యవహరిస్తూ, వాటికి అడ్డంకులు తొల గిస్తూ సంపద సృష్టికి దోహదం చేయాలన్నది మోదీ ప్రభుత్వ స్థూల విధానంలాగా కనిపిస్తున్నది.

 

 రైతుల ఆత్మహత్యలు పట్టవేం!

 

 కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికీ, రైతుల సంక్షేమానికీ, దళితులూ, ఆదివాసీలూ, మైనారిటీల అభివృద్ధికీ ప్రాధాన్యం ఇస్తున్న దాఖలా కనిపించడం లేదు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొనసాగుతున్నప్పటికీ పార్లమెంటులో కానీ, మంత్రిమండలి సమావేశాలలో కానీ వాటి ప్రస్తావనలేదు. వ్యవసాయాన్ని గిట్టుబాటు వ్యాసంగం చేయడం ఎట్లా అన్న దాని మీద సమాలోచన లేదు. దళితులకూ, ఆదివాసులకూ మేలుచేయాలన్న సంక ల్పం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకత్వంలో కనిపిస్తున్నది కానీ కేంద్ర ప్రభు త్వంలో కానీ, భాజపా పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ అటువంటి స్పృహ కనిపించడం లేదు. ఈ వర్గాలలో అత్యధికులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత ఉన్నవారే. వారి హృదయాలను గెలుచుకోవడానికి మోదీ ప్రభుత్వం బృహత్ ప్రయ త్నం చేయాలి.

 

 ప్రకటనలతో పొద్దు పుచ్చలేరు..

 

 రైతుల ప్రయోజనాలను పట్టించుకునే స్వభావం మోదీ ప్రభుత్వానికి ఉన్నదని నమ్మకం కలిగించే పని ఏదీ జరగలేదు. పైగా రైతులతో మమేకమయ్యే దేవెగౌడ, ములాయంసింగ్, లాలూప్రసాద్, శరద్ యాదవ్ వంటి నాయకులు ఏకతాటిపైకి వస్తున్నారు. దిగుబడులు తగ్గి, ధాన్యం రేట్లు తగ్గిపోయి, మద్దతు ధరలు కూడా చాలక  నానా అగచాట్లు పడుతున్న అన్నదాతలు ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌లో రైతుల భూములను వారి అభీష్టానికి విరుద్ధంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగు తోంది. మొత్తం మీద కోపంతో ఉన్న రైతులను వీధులలోకి రప్పించడానికి అవస రమైన శక్తియుక్తులు జనతాపరివార్‌కు ఉన్నాయి. రైతు ఉద్యమానికి జనతా పరివార్ ఎప్పుడు పిలుపునిస్తే అప్పుడు మోదీ సర్కార్ హనీమూన్ (‘అచ్ఛేదిన్’) ముగిసి నట్టూ, కష్టాలు ఆరంభమైనట్టూ లెక్క. వాగ్దానాలూ, ఆకర్షణీయమైన ప్రకటనలూ విని సంతోషించే సమయం ముగిసింది.

 

 బడాపారిశ్రామిక సంస్థలకూ, ఆశ్రీత పారిశ్రామిక, వ్యాపార సంస్థలకూ అను కూలమనే ముద్ర మోదీ ప్రభుత్వంపైన పడుతున్నది. అదే సమయంలో రైతులకూ, కార్మికులకూ వ్యతిరేకి అనే పేరు వస్తున్నది. మైనారిటీల సమస్య ఎట్లాగూ ఉంది. ఈ సంకేతాలను గమనించి సవరణ చర్యలు తీసుకుంటే మోదీ సర్కార్‌కు ప్రజల సహ కారం ఇతోధికంగా లభిస్తుంది. సమాజంలో బడుగువర్గాలనూ, సమస్యలతో సత మతం అవుతున్న వర్గాలనూ పట్టించుకొని వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న విశ్వాసం కల్పించడం నేటి అవసరమని ఉదారవాదులు భావి స్తున్నారు. వీరు కనుక మద్దతు ఉపసంహరించుకుంటే మోదీ వ్యతిరేక శక్తుల శక్తి పెరుగుతుంది.  


-murthykondubhatla@gmail.com


 
 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top