నెలాఖరు వరకు మరిన్ని విమానాలు : కిషన్ రెడ్డి

Singapore telugu samajam conference with kishan reddy - Sakshi

సింగపూర్‌ : కరోనా ప్రభావంతో సింగపూర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగువారి సమస్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గంతో జూమ్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో చిక్కుకున్న తెలుగు వారితో పాటు అనేక రాష్ట్రాలవారి కోసం అదనపు విమానాలను ఏర్పాటు చేయడంలో కృషిచేసినందుకు కిషన్‌ రెడ్డికి సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్-19 నివారణలో భాగంగా భారతదేశంలో ఉన్న పరిస్థితులను, భారత ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వివరించారు. మేకిన్ ఇండియాలో భాగంగా సొంతంగా భారతదేశం మాస్కులను, పీపీఈ కిట్లు, ఇతర వైద్య పరికరాలను తయారుచేసి ఇతర దేశాలకు కూడా సహాయం చేసే స్ధాయికి ఎదిగామన్నారు. అంతేకాకుండా  హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి ఔషధాలను అనేకదేశాలకు ఆపదలో అందించామన్నారు. విదేశాల్లో చిక్కుకొన్నవారికోసం వందేభారత్ మిషన్‌ను ప్రారంభించి విమానాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సింగపూర్ తెలుగు సమాజం విజ్ఞప్తి మేరకు మలివిడతలో కూడా నెలాఖరు వరకు మరిన్ని విమానాలను వీలైతే మరిన్ని గమ్యస్థానాలకు కూడా సమకూర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అత్యవసరాలు ఉన్నవారికి సింగపూర్ తెలుగు సమాజం స్వయంగా చార్టెడ్ విమానం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు.

ఈసమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారులు భరత్ రెడ్డి, కపిల్ ఏరో ఇండియా లిమిటెడ్ వ్యవస్ధాపకులు చిన్నబాబు పాల్గొన్నారు. ఈ మిషన్‌లో భాగంగా సహాయసహకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ, నిరంతరంగా శ్రమ పడుతున్న హైకమీషన్ వారికి సమాజ కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సమాజం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఈనెల 17న హైదరాబాద్ బయలుదేరుతుందని తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top