ఆ రెండుచోట్ల మంత్రం పనిచేస్తుందా? | Sakshi
Sakshi News home page

ఆ రెండుచోట్ల మంత్రం పనిచేస్తుందా?

Published Thu, Oct 16 2014 11:31 AM

ఆ రెండుచోట్ల మంత్రం పనిచేస్తుందా? - Sakshi

దాదాపు రెండు దశాబ్దాలుగా శివసేనతో ఉన్న చెలిమి చెడిపోయినా.. ఆ రాష్ట్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రంలో గట్టిగానే ప్రచారం చేశారు. 288 స్థానాలున్న మరాఠా పీఠాన్ని దక్కించుకుంటే తర్వాత రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో మార్గం సుగమం అవుతుందన్నది ఆయన దీర్ఘకాల ఆలోచన. ఇక 90 స్థానాలున్న హర్యానాను కూడా మోదీ వదల్లేదు. అక్కడ ఏకంగా 11 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ రాష్ట్రాన్ని కూడా వశం చేసుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు.

ఇంతకీ ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బ్రాండ్ పనిచేసిందా లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే. 19వ తేదీన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను ప్రతిపాదించిన అభ్యర్థి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించాలంటే తగినంత స్థాయిలో అసెంబ్లీల బలం కూడా మోదీకి అవసరం.

అందుకే ముందుగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో గెలవాలని గట్టి ప్రయత్నం చేశారు. ఒకదశలో గొంతు సహకరించకపోయినా కూడా అలాగే ప్రచారం చేశారు. పాకిస్థాన్ రేంజర్లు కాశ్మీర్ సరిహద్దుల్లో భారత బోర్డర్ ఔట్పోస్టులపై దాడులు చేస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఏం చేస్తారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినా కూడా పట్టించుకోలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే మాత్రం మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో ఫలితాలు రావడం కష్టమనే తెలుస్తోంది. అక్కడ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చని, అయితే అతిపెద్ద పార్టీగా మాత్రం బీజేపీయే అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

Advertisement
Advertisement