విభజనతో తలెత్తే సమస్యలను ముందుగా పరిశీలించి పరిష్కరించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని సొంత పార్టీ వ్యవహారంగా పరిగణించి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రం తగలబడుతోందని వెంకయ్య విమర్శించారు.
కాంగ్రెస్ నిర్ణయం వల్ల రాష్ట్రం తగలబడుతోంది: వెంకయ్య నాయుడు
Aug 13 2013 3:07 AM | Updated on Apr 7 2019 3:47 PM
విభజనతో తలెత్తే సమస్యలను ముందుగా పరిశీలించి పరిష్కరించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని సొంత పార్టీ వ్యవహారంగా పరిగణించి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రం తగలబడుతోందని వెంకయ్య విమర్శించారు. ‘‘ఎలాంటి ముందు జాగ్రత్తలూ లేకుండా అకస్మాత్తుగా, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హడావుడి నిర్ణయం తీసుకోవడమే ఈ దుస్థితికి కార ణం. తెలంగాణ ఏర్పాటు చేయాలనే నిబద్ధత కాంగ్రెస్‌కు నిజంగా ఉంటే తొమ్మిదేళ్ల పాటు ఏం చేశారు? ప్రణబ్‌ముఖర్జీ, రోశయ్య కమిటీ, శ్రీకష్ణ కమిటీ నివేదికలు ఏమయ్యాయి? చివరకు సొంత పార్టీలో కూడా ఏకాభిప్రాయం లేకపోయినా కాంగ్రెస్ నిర్ణయం ఎలా తీసుకుంది? సీఎం, పీసీసీ చీఫ్, సీమాంధ్రకు చెందిన తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో కూడా చర్చించకుండా రాత్రికి రాత్రి రాష్ట్రాన్ని ఎలా చీలుస్తారు? కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే తప్ప ఇంతవరకూ ప్రభుత్వ నిర్ణయమేదీ వెలువడలేదు.
రాష్ట్రలోని రెండు ప్రాంతాల్లో రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశం కాంగ్రెస్ నిర్ణయం వెనక స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తెలంగాణ నేతలతో సంబరాలు జరిపిస్తూ, సీమాంధ్రలో మాత్రం ‘బీజేపీ మొండిపట్టు పట్టడం వల్లే తెలంగాణ ఇవ్వాల్సి వస్తోంది’ అని చెప్పిస్తున్నారు. నిర్ణయానికి ముందు నిపుణుల కమిటీలు వేసి అన్ని అంశాలనూ కూలంకషంగా చర్చించి ఉండాల్సింది. ఇతర పార్టీలన్నింటితోనూ సంప్రదించి ఉండాల్సింది. ఆంటోనీ కమిటీతో ఏ సమస్యా పరిష్కారం కాదు. మన రాష్ట్ర రాజధాని అనుకుని హైద్రాబాద్‌కు తరలివచ్చి పెట్టుబడులు పెట్టిన వారికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి, స్థిరపడిన వారి భద్రతకు ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు? ఇతర ప్రాంతాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలు, ఎయిమ్స్ తరహా ఆసుపత్రులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులు, రక్షణ శాఖ లాబొరేటరీలు, భారీ పరిశ్రమలను ఎలా ఏర్పాటు చేస్తారు? ఇవన్నీ తేలాల్సి ఉంది. నదీజలాల పంపిణీ, విద్యుదుత్పత్తి, విద్య, ఆరోగ్యం, ఆదాయ పంపిణీ వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను తేలిగ్గా కొట్టిపారేయడం సాధ్యపడదు’’ అని అన్నారు.
Advertisement
Advertisement