కనువిందు చేస్తున్న టులిప్‌ తోట అందాలు

Uttarakhand CM Shares Stunning Tulip Garden Photos Goes Viral - Sakshi

ట్విటర్‌లో ఫొటోలు షేర్‌ చేసిన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి

అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది.. అంటూ హీరోహీరోయిన్లు డ్యూయెట్లు పాడుకోవడానికి ఇకపై మున్సియారీకి రావొచ్చు అంటున్నారు స్థానికులు. అందమైన రంగు రంగుల టులిప్‌ తోటల్లో హాయిగా విహరించవచ్చని పర్యాటకులను కూడా ఆహ్వానిస్తున్నారు. అల్లంత దూరాన.. హిమాలయాల్లోని పంచాచౌలి శ్రేణి అందాలు కనువిందు చేస్తుండగా.. పూల సువాసనలు ఆస్వాదించే అద్భుత అవకాశం సొంతం చేసుకోవాలని ఊరిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మున్సియారీ ప్రాంతంలో టులిప్‌ తోటల పెంపకాన్ని చేపట్టింది. పైలట్‌ ప్రాజెక్టుగా ఎరుపు, పసుపు, గులాబీ రంగు పూలనిచ్చే మొక్కల్ని అటవీ శాఖ అక్కడ నాటింది. ప్రపంచంలోని అతిపెద్ద టులిప్‌ తోటల్లో ఒకటిగా పేరుగాంచిన మున్సియారీ తోట ప్రస్తుతం విరబూసింది. (కనువిందు చేస్తున్న ఫ్లెమింగోలు..)

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. తన కలల ప్రాజెక్టు విజయవంతమైందని.. ఈ విషయాన్ని ప్రజలతో పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. పంచాచౌలి శ్రేణుల సమీపంలో మున్సియారీలో పెంచిన టులిప్‌ తోట ప్రపంచంలోని అతిపెద్ద టులిప్‌ తోటల్లో ఒకటని... దీని ద్వారా మున్సియారీ ప్రాంతంలో పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇక సీఎం షేర్‌ చేసిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వేల సంఖ్యలో ఆయన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. టులిప్‌ తోట అందాలు తమను అమితంగా ఆకట్టుకుంటున్నాయని.. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలంటూ కామెంట్లు చేస్తున్నారు. విదేశీ సొగసులను తలదన్నే అందంతో మైమరపింపజేస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా మున్సియారీ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే కరోనా పూర్తిగా కట్టడై లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాతే ట్రిప్‌ను ప్లాన్‌ చేసుకోండి!(ఇళ్ల ముందు నుంచే క‌నిపిస్తున్న మంచుకొండ‌లు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top