సచివాలయం, రోడ్ల విస్తరణకు భూములివ్వండి

TRS MPs seek PM's intervention in defence lands issue - Sakshi

ప్రధాని మోదీని కోరిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

రక్షణశాఖ భూములు బదలాయించాలని విజ్ఞప్తి

నిర్మలా సీతారామన్‌ ఆలస్యం చేస్తున్నారు: జితేందర్‌రెడ్డి

రోడ్లు విస్తరిస్తేనే ప్రజలకు సౌకర్యం: వినోద్‌కుమార్‌

సాక్షి, న్యూఢిల్లీ: నూతన సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో గ్రౌండ్స్, రోడ్ల విస్తరణకు రక్షణ భూము లు బదలాయించాల ని గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని టీఆర్‌ఎస్‌ ఎంపీలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చా రు. వెంటనే కల్పించుకుని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించేలా తగిన ఆదేశాలి వ్వాలని ప్రధానిని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కోరారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బాల్క సుమన్, బీబీ పాటిల్, దయాకర్, బండా ప్రకాశ్, లింగయ్య యాదవ్, మల్లారెడ్డి తదితరులు శుక్రవారం పార్లమెంటు లో ప్రధానితో సమావేశమయ్యారు.

నూతన సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో గ్రౌండ్స్, రోడ్ల విస్తరణకు కంటోన్మెంట్‌లో స్ట్రాటజిక్‌ రోడ్లు బదలాయింపునకు గతంలో కేంద్ర రక్షణశాఖ మంత్రులుగా పనిచేసిన మనో హర్‌ పారికర్, అరుణ్‌ జైట్లీ సూత్రప్రాయంగా అంగీకరించారని వివరించారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ కూడా పలు మార్లు కేంద్రాన్ని కోరారని వెల్లడించారు. అలాగే ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించేలా రూపొందించుకున్న కొత్త జోనల్‌ వ్యవస్థను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలయ్యేలా చూడాలని కోరారు.

తెలంగాణ విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం: జితేందర్‌రెడ్డి
సమావేశం అనంతరం టీఆర్‌ఎస్‌ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. బైసన్‌పోలో గ్రౌండ్స్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం 595 ఎకరాలు సహా అదనంగా రూ.95 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీకి వివరించామని ఎంపీ జితేందర్‌రెడ్డి చెప్పారు. అయితే బైసన్‌పోలో సమీపంలో ఉన్న కట్టడాల ద్వారా రక్షణశాఖకు ఏటా రూ.31 కోట్ల ఆదాయం వస్తోందని, దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరడం సరికాదని.. ఈ నిబంధనను తొలగించాలని విన్నవించామన్నారు.

ఇటీవల కర్ణాటక అభ్యర్థన మేరకు ఆ రాష్ట్రానికి 210 ఎకరాలను ఆగమేఘాల మీద బదలాయించిన రక్షణశాఖ.. తెలంగాణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో పనిచేసిన ఇద్దరు రక్షణశాఖ మంత్రులు భూముల బదలాయింపునకు అంగీకరిస్తే.. ఇప్పటి రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం భూముల బదలాయింపును ఆలస్యం చేస్తున్నారని అన్నారు.

అందుకే బైసన్‌ పోలో ఫైలు, కంటోన్మెంట్‌ స్ట్రాటజిక్‌ రోడ్ల ఫైలు విడిగా పంపాలని ఆమె కోరుతున్నారని చెప్పారు. బైసన్‌పోలో గ్రౌండ్‌ ఇచ్చివుంటే ఇప్పటికే రూ.400 కోట్లతో అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించేవాళ్లమని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్‌లో రోడ్లు విస్తరిస్తేనే హైదరాబాద్, సికింద్రాబాద్‌ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఎంపీ వినోద్‌ కుమార్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top