చచ్చిపోతా.. అనుమతించండి | transgender woman seeks President nod to mercy killing | Sakshi
Sakshi News home page

చచ్చిపోతా.. అనుమతించండి

Feb 14 2018 8:34 PM | Updated on Feb 15 2018 2:03 PM

transgender woman seeks President nod to mercy killing - Sakshi

షనావీ పొన్నుసామి (ట్విటర్‌ ఫొటోలు)

సాక్షి, న్యూఢిల్లీ: కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లింగమార్పిడి మహిళ(ట్రాన్స్‌జెండర్‌ వుమన్‌) ఒకరు లేఖ రాశారు. లింగ సమస్య కారణంగా ప్రభుత్వ ఎయిర్‌లైన్స్‌ ఎయిరిండియా తనకు క్యాబిన్‌ క్రూ ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో షనావీ పొన్నుసామి ఈ మేరకు రాష్ట్రపతిని వేడుకున్నారు. లింగమార్పిడి మహిళల విభాగం లేకపోవడంతో అర్హత, అనుభవం ఉన్నప్పటికీ తనకు ఎయిరిండియా ఉద్యోగం నిరాకరించిందని షనావీ మీడియాతో చెప్పారు. జెండర్‌ సమస్య కారణంగా విమానయాన పన్నుల్లో తాను ఎటువంటి రాయితీలు పొందలేదని, అలాంటప్పుడు ఇదే కారణంతో ఉద్యోగం ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించారు. ‘నేను బతికుండటమో, చనిపొవడమో రాష్ట్రపతి చేతుల్లో ఉంద’ని స్పష్టం చేశారు.

షనావీ ఫస్ట్‌..
ఎయిరిండియా వద్దన్న తర్వాత ఏ ఇతర ఎయిర్‌లైన్స్‌లోనూ ఉద్యోగం కోసం ప్రయత్నించలేదని వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలోనే తనకు చోటులేకపోతే ప్రైవేటు సంస్థల్లో స్థానం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. షనావీ కుటుంబంలో గ్రాడ్యుయేషన్‌ చేసి క్వాలిఫైడ్‌ ఇంజనీర్‌ అయిన మొదటి వ్యక్తి ఆమె. మోడల్‌, నటి, ఎయిర్‌లైన్‌లో కస్టమర్‌ సపోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ పనిచేశారు. 2016లో తొలిసారిగా ఎయిరిండియాలో క్యాబిన్‌ క్రూ పోస్ట్‌ కోసం దరఖాస్తు చేశారు. మహిళా విభాగంలో నాలుగుసార్లు దరఖాస్తు చేసినా ఎయిరిండియా తిరస్కరించింది. అన్ని అర్హతలు ఉన్నా తనకు ఉద్యోగం ఎందుకు రావడంలేదో మొదట్లో ఆమెకు అర్థం కాలేదు. లింగమార్పిడి కారణంగానే తనకు జాబ్ ఇవ్వడం లేదని తర్వాత తెలుసుకున్నారు.

సుప్రీంకోర్టు తలుపుతట్టి..
తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని తిరుచందూరుకు చెందిన షనావీ పేద కుటుంబం నుంచి వచ్చారు. 2010లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీర్‌గా అర్హత సాధించారు. 2013లో ఎయిరిండియా కస్టమర్‌ సపోర్ట్‌ విభాగంలో మొదటి ఉద్యోగం సంపాదించారు. ఆమెకు క్యాబిన్‌ క్రూ ఉద్యోగం ఇచ్చేందుకు పౌరవిమాన శాఖలో సీనియర్‌ అధికారి ఒకరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చేసేదిలేక 2017లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లింగమార్పిడి కారణంగా తనపట్ల వివక్ష చూపుతున్నారని సర్వోన్నత న్యాయస్థానానికి మొరపెట్టుకున్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement