టిప్పు జయంతి వేడుకలు.. తీవ్ర ఉద్రిక్తత

Tippu Jayanti Celebrations Tight Security Deployed in Karnataka - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : టిప్పు సుల్తాన్‌​ జయంతి వేడుకలు కన్నడనాట చిచ్చును రాజేస్తున్నాయి. బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల అవి హింసాత్మకంగా మారాయి. 

ఉదయం కొడగు జిల్లా మడికరి ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళన కారులు.. దానిని పాక్షికంగా ధ్వంసం చేశారు.  మరికొన్ని చోట్ల అల్లర్లకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, సమస్యాత్మక ప్రాంతాలైన మైసూర్‌, కొడగు, ఉడిపిలో గత రెండు రోజులుగా నిఘా వేసిన పోలీసులు.. ఈ ఉదయం నుంచే భారీ ఎత్తున్న మోహరించారు. 

మొత్తానికి తీవ్ర ఉద్రిక్తత, భారీ భద్రత నడుమే సిద్ధరామయ్య ప్రభుత్వం టిప్పు జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే తాము వేడుకలకు భద్రత కల్పించామని.. ఇందులో ఎలాంటి పక్షపాత ధోరణి లేదని బెంగళూర్‌ పోలీస్‌ కమీషనర్‌ టి సునీల్‌ కుమార్‌ తెలిపారు. 25 ఫ్లాటూన్‌ దళాలు, కర్ణాటక రిజర్వ్డ్‌ పోలీసులు అంతా కలిపి 11,000 మందితో భద్రతను నగరంలో మోహరించినట్లు ఆయన చెప్పారు. 

వివాదం.. 

కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల క్రితం నుంచి టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించటం మొదలుపెట్టింది. అయితే బీజేపీతోపాటు పలు హిందూ అనుబంధ సంఘాలు, కోదావా తెగకు చెందిన కొందరు సభ్యులు టిప్పు జయంతి వేడుకలను ఖండిస్తూ వస్తున్నాయి. వీరికి ఇప్పుడు కనరా క్రిస్టియన్లు మద్దతు ప్రకటించటం గమనార్హం. కాగా, 2015 వేడుకల్లో కొడగు జిల్లాలో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు చనిపోయారు కూడా. టిప్పు సుల్తాన్‌ హిందువులను ఊచకోత కోయించాడని.. అలాంటి వ్యక్తి పేరిట వేడుకలను ప్రభుత్వం నిర్వహించటం దారుణమని పలువురు ఖండిస్తూ వస్తున్నారు. వీరిలో కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే కూడా ఉన్నారు. ఈ మధ్యే టిప్పు జయంతి వేడుకల పై స్టే విధించాలన్న పలువురి అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top