ఈ పాపులర్‌ యాప్స్‌ అన్నీ చైనావే

These are The Top Popular Chinese Apps In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ వినియోగదారుల సమస్త సమాచారాన్ని కూడగడుతున్న చైనాకు చెందిన 52 యాప్స్‌ను అడ్డుకోవాలంటూ ఇటీవల ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీకి నేరుగా విజ్ఞప్తి చేశాయంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ప్రధాని స్పందనేమిటో తెలియరాలేదు. అయితే అడ్డుకోవాలని కోరుతున్న యాప్స్‌ జాబితాలో భారత్‌లో అత్యధిక ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్, షేర్‌ ఇట్, బిగో లివ్, క్లబ్‌ ఫ్యాక్టరీ, షైన్, హెలో తదితర యాప్స్‌ ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యాప్స్‌ అన్నీ భారత ఆర్థిక వ్యవహారాలకు ఉపయోగపడుతున్నాయి. వీటిలో టిక్‌టాక్, హలో, బిగో వీడియో యాప్‌లు సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి. టిక్‌టాక్‌కు భారత్‌లో నెలవారిగా 12 కోట్ల మంది, హెలోకు ఐదు కోట్ల మంది, బిగో లివ్‌కు 2.20 కోట్ల మంది ఉన్నారు.పెద్దగా ప్రచారం లేకపోయినప్పటికీ క్లబ్‌ ఫ్యాక్టరీకి పది కోట్ల మంది, షైన్‌కు 50 లక్షల మంది డౌన్‌లోడర్లు ఉండడం విశేషం. (చైనా ప్ర‌క‌ట‌న‌పై కేంద్రం స్పందించాలి)

స్మార్ట్‌ఫోన్ల ద్వారా సెల్ఫీల మోజు పెరగడంతో సెల్ఫీల్లో అందంగా కనిపించడం కోసం బ్యూటీప్లస్, మేకప్‌ప్లస్‌ లాంటి యాప్స్‌ను కూడా చైనా తీసుకొచ్చింది. కేవలం భారతీయ వినియోగదారుల కోసమే ‘బ్యూటీప్లస్‌ మీ’ అంటూ మరో యాప్‌ను సృష్టించింది. వీటితోపాటు ఫొటో వాండర్, యూకామ్‌ మేకప్, సెల్ఫీసిటీ, వాండర్‌ కెమేరా, పర్‌ఫెక్ట్‌ కోర్‌ అనే మరో నాలుగు బ్యూటీ యాప్స్‌ను కూడా అడ్డుకోవాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు కోరుతున్నాయి. ఫైల్‌ షేరింగ్‌ టూల్స్‌గా ఉపయోగపడుతున్న షేర్‌ఇట్, క్సెండర్‌ యాప్స్‌ కూడా ఉన్నాయి. షేర్‌ఇట్‌కు దేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 

ఇక నెట్‌ బ్రోజర్లలో చైనాకు చెందిన యూసీ బ్రోజర్, ఏపీయుఎస్‌ బ్రోజర్, సీఎం బ్రోజర్, డీయూ బ్రోజర్‌లు ఉన్నాయి. చైనా దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూపునకు చెందిన యూసీ బ్రోజర్‌కు 13 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అది 14 భారతీయ భాషలను సపోర్ట్‌ చేస్తోంది. అలీబాబా కంపెనీకి చెందిన వార్తల సమీకరణ సంస్థ యూసీ న్యూస్‌ భారతీయ భషలైన హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ, మరాఠీ, ఒడియా, అస్సామీస్, భోజ్‌పూరి తదితర భాషల్లో కూడా ప్రాచుర్యం పొందింది. దీంతోపాటు న్యూస్‌డాగ్‌ వెబ్‌ను కూడా అడ్డుకోవాలని కోరుతున్నారు. (చైనా వస్తువులను బహిష్కరించండి)

ఇక స్మార్ట్‌ఫోన్ల రంగంలో భారత్‌లో సంచలనం సృష్టించిన షావోమీ కంపెనీ ఫోన్లతోపాటు ఫిట్‌నెస్‌ పరికరాలను కూడా ఇంటెలిజెన్స్‌ జాబితాలో ఉన్నాయి. షావోమీ తన స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల్లో 30 శాతం ఉత్పత్తులను, ఫిట్‌నెస్‌ పరికరాల్లో 50 శాతం ఉత్పత్తులను ఒక్క భారత్‌లోనే విక్రయిస్తోంది. వీటికి సంబంధించిన యాప్స్‌ కూడా అడ్డుకోవాలనుకుంటోన్న జాబితాలో ఉన్నాయి.  భారత్, చైనా సరిహద్దుల్లో సైనికుల సంఘర్షణతో చైనా ఉత్పత్తులను, యాప్స్‌ను బహిష్కరించాలనే వాదనల ప్రభావం అప్పుడే కనిపిస్తోంది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ‘అప్పో’ భారతీయ మార్కెట్‌లో తన కొత్త ప్రాడక్ట్‌ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top