'తెలంగాణ' ఒకరి గెలుపు.. మరొకరి ఓటమి కాదు: కేసీఆర్ | Telangana state formation not one's win.. or someones loss: KCR | Sakshi
Sakshi News home page

'తెలంగాణ' ఒకరి గెలుపు.. మరొకరి ఓటమి కాదు: కేసీఆర్

Feb 20 2014 10:14 PM | Updated on Aug 15 2018 9:17 PM

'తెలంగాణ' ఒకరి గెలుపు.. మరొకరి ఓటమి కాదు: కేసీఆర్ - Sakshi

'తెలంగాణ' ఒకరి గెలుపు.. మరొకరి ఓటమి కాదు: కేసీఆర్

తెలంగాణ చరిత్రలో మరిచిపోలేనటువంటి మధురమైన ఘట్టం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్ రావు అన్నారు.

తెలంగాణ చరిత్రలో మరిచిపోలేనటువంటి మధురమైన ఘట్టం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు తమ అస్థిత్వం కోసం కొనసాగించిన ఆరు దశాబ్దాల పోరాటం అద్భుతమైన విజయాన్ని సాధించింది అని అన్నారు. తెలంగాణ చరిత్రలో ఈ రోజు జరిగిన ఘట్టం సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఒక్కరి గెలుపు కాదు ఓటమి కాదు అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు అస్థిత్వం కోరుకున్నారు. స్వయం పాలన కోరుకున్నారు. అది సాధించుకున్నారు అని అన్నారు. ఉద్యమ క్రమంలో వివిధ వ్యక్తులు, సంఘాల మధ్య ఏర్పడిన విభేదాలను గుర్తులో పెట్టుకోవద్దని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మహుతి చేసుకున్న అమరవీరులకు అంకితమన్నారు.
 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల నిజమైన సమయంలో తెలంగాణ సిద్దాంత కర్త ఫ్రొఫెసర్ జయశంకర్ లేకపోవడం బాధకలిగిస్తోంది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జయశంకర్ కు అంకితమిస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన మంచి చెడులను మరిచిపోయి ఇరుప్రాంతాల ప్రజలు తమ అభివృద్దికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర ప్రజలు మావాళ్లు కాదని ఎప్పుడు అనుకోలేదు.. వాళ్లు అద్బుతంగా హైదరాబాద్ లో జీవించవచ్చు అని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న వారు ఎక్కడ ఉన్న ప్రజలు ప్రజలే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి ఢోకాలేదని.. ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కేసీఆర్ హామీ ఇచ్చారు. 
 
తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అస్థిత్వం కోసం ఎదురైన అడ్డంకులను అధిగమించి, కఠిన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నాలుగున్నర కోట్ల ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. భారత ప్రభుత్వం తరపున తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టడానికి సహకారం అందించిన ప్రధాని మన్మోహన్ సింగ్, బిల్లు రూపకల్పన చేసిన హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, లోకసభ లో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ, బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, మాయవతి, లాలూ ప్రసాద్ యాదవ్ లకు ధన్యవాదాలు తెలిపారు. నేను పిలుపుఇస్తే అష్టకష్టాలు పడుతూ సహకారమందించిన టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలకు కృతజ్క్షతలు తెలిపారు. ఉద్యమ సంఘాలు, జేఏసీలకు, ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement