ఒక్కో విద్యార్థికి 20 లక్షలివ్వండి: సుప్రీం

Supreme Court orders Rs 20 lakh each for 21 students denied MBBS - Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మెరిట్‌ విద్యార్థులకు కాకుండా అనర్హులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లు కట్టబెట్టిన ఓ మెడికల్‌ కాలేజీపై సుప్రీంకోర్టు కొరడా ఝుళి పించింది. ఈ ఘటనలో నష్టపోయిన 19 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కళాశాలను జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యు.యు.లలిత్‌ల ధర్మాసనం ఆదేశించింది. బాధితులకు చెల్లించాల్సిన రూ.3.8 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రవేశ్‌ నియంత్రణ్‌ కమిటీ వద్ద డిపాజిట్‌ చేయాలని సూచించింది. మహారాష్ట్రలోని డా.ఉల్హాస్‌ పాటిల్‌ వైద్య కళాశాల 2012–13లో 19 మంది మెరిట్‌ విద్యార్థులకు సీట్లను నిరాకరించింది. ఈ కేసును తొలుత విచారించిన బాంబే హైకోర్టు కాలేజీ గుర్తింపును, అఫిలియేషన్‌ను రద్దుచేయాలని ఆదేశించింది. దీంతో కళాశాల యాజమాన్యం సుప్రీంను ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు చెల్లించాలని, మూడు నెలల్లో నిర్ణీత మొత్తం చెల్లించకుంటే బాంబే హైకోర్టు ఉత్తర్వుల్ని అమలుచేస్తామని హెచ్చరించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top