ఉత్తరాఖండ్‌లో బలపరీక్షపై స్టే | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో బలపరీక్షపై స్టే

Published Thu, Mar 31 2016 3:40 AM

ఉత్తరాఖండ్‌లో బలపరీక్షపై స్టే - Sakshi

హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశం
♦ సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఏప్రిల్ 7 వరకు నిలుపుదల
 
 నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. గురువారం అసెంబ్లీలో జరపాల్సిన బలపరీక్షపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఏప్రిల్ 7 వరకు స్టే విధించింది. బలపరీక్ష జరపాలని సింగిల్ జడ్జి యూసీ ధ్యాని ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రపతి పాలనను సవాల్‌చేస్తూ పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ వేసిన రిట్ పిటిషన్‌పై తుది విచారణను ఏప్రిల్6కు వాయిదా వేసింది. పిటిషన్ సంబంధ అప్పీళ్లను ఏప్రిల్ 7 వరకు నిలిపివేస్తున్నామంది. జస్టిస్ ధ్యాని ఉత్తర్వులను సవాల్ చేసిన కేంద్రానికి దీంతో ఊరట లభించినట్లైంది.

కేంద్రం తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గీ.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్‌చేస్తూ వేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ విచారించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏజీ అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో, అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉండగా పరీక్ష ఎలా జరుపుతారని, రాష్ట్రంలో ప్రభుత్వమే లేనప్పుడు ఎవరికి పరీక్ష పెడతారని అన్నారు. సుప్తచేతనావస్థలో ఉన్న సభను ఎవరు జరుపుతారని ప్రశ్నించారు.

కోర్టు  స్పందిస్తూ.. మెజారిటీని నిర్ణయించేందుకు సరైన వేదికైన బలపరీక్ష మార్చి 28న ఉండగా.. హడావుడిగా మార్చి 27న రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏంటని అడిగింది. అసెంబ్లీలో రాజ్యాంగ వ్యతిరేక పరిణామాలు చోటుచేసుకున్నాయని ఏజీ చెప్పారు. కేంద్రం తరఫున, కేంద్ర పాలనలోని ఉత్తరాఖండ్ తరఫున కౌంటర్ అఫిడవిట్‌లను ఏప్రిల్ 4లోగా సమర్పిస్తామన్నారు. రిజాయిండర్ అఫిడవిట్‌ను 24 గంటల్లో ఇవ్వాలని  రావత్‌ను బెంచ్ ఆదేశించింది. కాగా, తమ అనర్హతపై కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను జస్టిస్ యూసీ ధ్యాని ఏప్రిల్ 1కి వాయిదావేశారు.
 
 ఆర్డినెన్స్‌లకు ఆమోదం..
 ఏప్రిల్ 1 తరువాత ఉత్తరాఖండ్ ప్రభుత్వ వ్యయానికి అందించే నిధులకు సాధికారత అందించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అలాగే, శత్రు ఆస్తుల(ఎనిమీ ప్రాపర్టీ) చట్టంలో సవరణలకు సంబంధించి ఆర్డినెన్స్‌ను ఆమోదించిందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement