
వాషింగ్టన్ : నా కూతురికి నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను. ఎగతాళి చేయడానికి మీరు ఎవరు..? అంటూ ప్రశ్నిస్తున్నారు ఓ ప్రయాణికురాలు. టెక్సాస్‌లో జరిగింది ఈ సంఘటన. వివరాలు.. ఓ ప్రయాణికురాలు తన కూతురుతో కలిసి టెక్సాస్‌లోని సౌత్‌వెస్ట్ విమానాశ్రయానికి వచ్చారు. చెకింగ్ సమయంలో విమానాశ్రయ ఉద్యోగి ఒకరు తన కూమార్తెను ఎగతాళి చేశారని తెలిపింది. సదరు ప్రయాణికురాలి కుమార్తె పేరు ‘ఏబీసీడీఈ’. దాంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆ బాలిక పేరును ‘ఎబ్సిడీ’ అని ఎగతాళిగా పలకడమే కాక పక్కనే ఉన్న మిగతా సిబ్బందికి కూడా చెప్పి కామెంట్ చేయడం ప్రారంభించారు. అంతేకాక ఆ బాలిక బోర్డింగ్ పాస్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
స్నేహితుల ద్వారా ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. దాంతో సదరు మహిళ ఈ విషయం గురించి ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. దాంతో ఆగ్రహించిన సదరు మహిళ ఈ విషయం గురించి స్థానిక మీడియాతో మాట్లాడింది. ‘నా కూతురికి నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను. కామెంట్ చేయడానికి వారికేం హక్కుంది. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించిడం సిబ్బంది కనీస బాధ్యత. కానీ వారు నా కుమార్తె పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. తన పేరును ఎగతాళి చేయడమే కాక.. తన బోర్డింగ్ పాస్‌ను మా అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు’ అంటూ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఈ విషయం కాస్తా వైరల్‌గా మారటంతో సదరు విమానాశ్రయ అధికారులు ప్రయాణికురాలికి క్షమాపణలు తెలిపారు.