వారి ఆక‌లి కేక‌లు వినపడవా: సోనియా గాంధీ

Sonia Gandhi Slams Centre For Being Insensitive Towards Migrants - Sakshi

న్యూఢిల్లీ : దేశం మొత్తానికి వ‌ల‌స కార్మికుల క‌ష్టాలు క‌నిపిస్తుంటే ప్ర‌భుత్వానికి మాత్రం క‌నిపించ‌డం లేదని కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ అన్నారు. నిరుపేద‌లు, చిరు వ్యాపారులు, వ‌ల‌స కూలీల స‌హాయార్థం ఏర్పాటు చేసిన 'స్పీక్ అప్ ఇండియా' క్యాంపెయిన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో గురువారం సోనియా మాట్లాడారు. తిన‌డానికి తిండిలేక కాలిబాట‌నే స్వ‌స్థ‌లాల‌కు చేరుకుంటున్న వ‌ల‌స కూలీల బాధ‌లు వ‌ర్ణ‌ణాతీతం అని పేర్కొన్న  సోనియా.. కేంద్ర‌ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే వారికి స‌హాయం అందించాల‌ని డిమాండ్ చేశారు.

లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి కోల్పోయిన వల‌స కూలీలకు  భ‌రోసానిచ్చే బాధ్య‌త కేంద్రంపై ఉందని గుర్తుచేశారు. ప్ర‌తి పేద కుటుంబానికి తక్ష‌ణ స‌హాయం కింద 10,000 రూపాయల‌ను అందివ్వాల‌ని, వ‌చ్చే ఆరు నెల‌ల పాటు 7,500 రూపాయ‌ల‌ను వారి ఖాతాల్లో జ‌మ‌చేయాల‌ని కోరారు. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నులు లేక ఆక‌లితో అల‌మ‌టిస్తూ.. కిలోమీట‌ర్ల మేర‌ ర‌హ‌దారుల వెంబ‌డి కాలిన‌డ‌క‌న ప్ర‌యాణిస్తున్న వ‌ల‌స‌కూలీల ఆక‌లి కేక‌లు కేంద్రానికి ఎందుకు వినిపించ‌డం లేదని సూటిగా ప్ర‌శ్నించారు.  (‘సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తీరు’ )

దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వ‌ల‌స కార్మికుల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చేందుకు అవ‌స‌ర‌మైన ర‌వాణా స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయాల‌ని మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు.. కేంద్రాన్నీ, రాష్ట్ర ప్ర‌భుత్వాలను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. వ‌ల‌స కూలీలకు ఆహారం, ఆశ్ర‌యం ఉచితంగా ఇవ్వాలని సూచించింది. లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికుల స‌మ‌స్య‌ల‌పై తనంత తానుగా సుప్రీంకోర్టు స్పందించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మే28కి వాయిదా వేసింది. (వలస జీవుల కష్టాలు తీర్చండి!  )

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top